ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:21 AM
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి, మార్చి 16: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి అని తెలిపారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం.. ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మరికాసేపట్లో అమరజీవి విగ్రహావిష్కరణ..
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని రాజధాని అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11:15 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహం.. అమరజీవి కాంస్య విగ్రహం. శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో అమరజీవి స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం 6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం తయారీ కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
అమరజీవికి లోకేశ్ ఘన నివాళి..
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారని గుర్తు చేశారు.
సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దామని ప్రజలకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాల వేదికగా అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
For More AP News And Telugu News