శ్రీశైలంలో విషాదం ఐదుగురి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:17 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలికిపాటుకు గురిచేసింది.
అందరిదీ ఒకే కుటుంబం.. సత్రంలో బలవన్మరణం
మృతుల్లో ముగ్గురు అక్కలు, తమ్ముడు, మేనల్లుడు
స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణం
నిబంధనల ప్రకారం గదిలో 2 రోజులే ఉండాలి
అనారోగ్యం పేరిట నెల రోజులుగా అక్కడే బస
గది నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన సిబ్బంది
శ్రీశైలం/నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందినవారు కాగా.. అప్పులు, అనారోగ్య సమస్యలతోపాటు కుటుంబ పోషణ భారమై.. జీవితంపై విరక్తి చెంది వీరు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతులు బత్తలపల్లి వడ్డే కాలనీకి చెందిన సుధాకర్(36), ఆయన సోదరీమణులు ఆదిలక్ష్మి(45), మల్లీశ్వరి(40), శ్రీదేవి (38), మేనల్లుడు మణికంఠ(14)గా గుర్తించారు.
నెల నుంచి సత్రంలోనే..
గతనెల 28న ఈ కుటుంబం శ్రీశైలానికి వచ్చింది. వడియరాజుల నిత్యాన్నదాన సత్రంలో సుధాకర్ రెండు గదులను తీసుకున్నారు. రెండు రోజుల తరువాత గది ఖాళీచేయమని కోరితే.. తన మేనల్లుడు మణికంఠ ఆరోగ్యం బాగాలేదని, ఇక్కడ పూజలు చేయించాలని.. సత్రం సిబ్బందిని బతిమాలుకుంటూ రోజుకు రూ.800 అద్దె చెల్లించి 28 రోజులుగా సత్రంలోనే ఉండిపోయారు. కానీ, సుధాకర్ మేనల్లుడు మణికంఠ వారం క్రితమే వచ్చినట్లు సమాచారం. గత మూడు రోజులుగా వీరందరూ గది నుంచి బయటకు రాలేదు. సత్రం సిబ్బంది కూడా గమనించలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మంగళవారం ఉదయం తలుపులు తట్టారు. ఎంతసేపటికీ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సుబ్బారెడ్డి అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు. లోపల గదిలో సుధాకర్, మేనల్లుడు మణికంఠ ఉరి వేసుకున్నారు. బాత్‌రూంలో ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి ఉరికి వేలాడుతూ కనిపించారు. గదులకోసం సుధాకర్ ఇచ్చిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులని గుర్తించారు. సాయంత్రం సున్నిపెంట ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావడంతో బంధువులు వచ్చి అక్కడే ఖననం చేశారు.
చెదిరిన వైవాహిక బంధాలు
సుధాకర్ సోదరి ఆదిలక్ష్మికి పెళ్లి చేసినా అత్తారింటికి వెళ్లకుండా, తమ్ముడి వద్దనే భర్త రాముడుతో కలిసి ఉండేది. వేరుగా ఉందామని రాముడు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సమస్యలు తలెత్తి.. దంపతులు విడిపోయారు. మల్లీశ్వరికి కొడుకు పుట్టిన తరువాత భర్త వదిలేశారు. కుమారుడితో కలిసి పుట్టింటిలోనే ఉంటోంది. శ్రీదేవికి వివాహం కాలేదు. పక్షవాతం సోకడంతో మంచానికి పరిమితమైంది. మణికంఠ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో ముగ్గురు అక్కలు, మేనల్లుడి పోషణ బాధ్యతలను సుధాకర్ చూసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుధాకర్ అవివాహితుడిగానే మిగిలిపోయాడు. ఆ ఇంటి నుంచి సుధాకర్ మినహా ఎవరూ బయటకు వచ్చేవారు కాదని స్థానికులు అంటున్నారు. పుట్టి 14 ఏళ్లు గడిచినా, మణికంఠను బయట సరిగా చూసింది లేదని ఇరుగుపొరుగువారు అంటున్నారు. సుధాకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నేళ్ల కిందట రూ.40 లక్షలు అప్పు చేసి ఐషర్ వాహనాలను పెట్టి నష్టపోయాడు. మొత్తం అప్పులు రూ.కోటి దాటినట్లు సమాచారం.
పథకం ప్రకారమే శ్రీశైలానికి..
సుధాకర్ అక్క శ్రీదేవి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమైంది. ఆమెకు చికిత్స కోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి వెళుతున్నామని గతనెల 25న సుధాకర్ చెప్పాడు. రెండు రోజుల తరువాత శ్రీశైలానికి వెళ్లారు. కాగా, తాను ఎప్పటికైనా శ్రీశైలంలోనే చనిపోతానని సుధాకర్ ఎప్పుడూ తమతో అనేవాడని, అన్నంత పనిచేశాడని అతడి స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సామూహిక ఆత్మహత్యల గురించి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్‌కుమార్‌కు మంత్రి సత్యకుమార్ ఫోన్ చేశారు. బత్తలపల్లి తహసీల్దార్ ఈశ్వరప్రసాద్, ఇన్‌చార్జి ఎంపీడీవో కిష్టప్ప తదితరులు సుధాకర్ ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఈ వార్తలను కూడా చదవండి