Share News

విదేశీ పర్యటనల విధి విధానాలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:37 AM

సార్వభౌమాధికారం అనేది ఒక దేశానికి తన విదేశీ వ్యవహారాలపై ఉండే సర్వోన్నతమైన, స్వతంత్ర అధికార పర్యవేక్షణ. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో మాత్రమే...

విదేశీ పర్యటనల విధి విధానాలు

సార్వభౌమాధికారం అనేది ఒక దేశానికి తన విదేశీ వ్యవహారాలపై ఉండే సర్వోన్నతమైన, స్వతంత్ర అధికార పర్యవేక్షణ. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో మాత్రమే ఉంటుంది. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం సంస్థానాధీశులు స్వతంత్ర రాజులుగా సర్వాధికారాలు చలాయించినా విదేశీ వ్యవహారాలు బ్రిటన్ పర్యవేక్షణలో ఉండేవి. స్వాతంత్ర్యం సిద్ధించాక అవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. కేంద్రం పరిధిలోని విదేశాంగ మంత్రిత్వశాఖ మన దౌత్య విధానాలను అమలుపరుస్తున్నది. విదేశాలకు వెళ్లే సగటు భారతీయుడికి అవసరమైన పాస్‌పోర్టు మొదలు విదేశీ గమ్యస్థానం చేరుకున్న తర్వాత అక్కడ అతడి నడవడిని సైతం మన దౌత్య అధికారులు సదా గమనిస్తుంటారు. విదేశాలలోని మన రాయబారుల కార్యాలయాలు సంబంధిత దేశంలో మన అధికార ప్రముఖుల పర్యటనలను సమన్వయం చేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగశాఖ ఆక్షేపణ తెలిపింది. దీంతో రేవంత్‌ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌లో పర్యటనను పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగిరావడం ప్రజల్లోను, రాజకీయ వర్గాలలోను చర్చనీయాంశమయింది.

ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రుల అధికారిక విదేశీ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం అనేది రాజకీయాలకు అతీతంగా జరిగే సాధారణ ప్రక్రియ. అధికార ప్రముఖుల విదేశీ పర్యటనలను విదేశాంగ విధానానికి అనుగుణంగా సమన్వయపరచడం విదేశీ వ్యవహారాల శాఖ విధి. బహిరంగంగా వెల్లడించలేని విధానానికి విభిన్నంగా పర్యటనలు ఉంటే వాటిని ఆక్షేపించడం, ఆపడం కూడా విదేశాంగశాఖ బాధ్యత.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. తెలుగువాడైన ఒక కేంద్ర మంత్రికి విదేశాల నుంచి ఆహ్వానం ఉన్నా వారి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. తెలుగువాడైన మరో కేంద్ర మంత్రి విదేశాల్లో ఒక సదస్సుకు వెళ్లేందుకు అనుమతించారు. గతంలో కొందరు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వలేదు.


2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు.. పాకిస్థాన్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇచ్చే అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడంతో పాటు నవాజ్ షరీఫ్ సహా పలువురు రాజకీయ నాయకులను కలవడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2012లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్.. పాకిస్థాన్‌ పర్యటనలో జిన్నా సమాధిని సందర్శించేందుకు అనుమతించింది. అయితే 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు ఆక్షేపణ తెలిపింది. ఈ అనుమతి నిరాకరణపై రాజకీయ రాద్ధాంతం చేయకుండా లండన్‌ నుంచి హుందాగా వెనక్కివచ్చి ఆయన కూడా విజ్ఞత ప్రదర్శించారు. తిరిగి వచ్చిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆచితూచి మాట్లాడారు.

ఒకప్పుడు విధి విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వ అధికారిక బృందాలు పరిమిత సంఖ్యలో విదేశీ పర్యటనలు చేసేవి. ఆ తర్వాత పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం ఉన్నతాధికారులతో సహా విదేశీ పర్యటనలకు వెళ్లడం ప్రారంభమయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఈ తరహా విదేశీ పర్యటనలకు నాంది పలికారు. అవి సాధించిన సత్ఫలితాలకు ఆకర్షితులై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆ తరువాత ఇతరులు విదేశీ పర్యటనలు చేశారు. పిదప, రాష్ట్రాల మంత్రులు సైతం విదేశీ పర్యటనలు మొదలుపెట్టారు.

ముఖ్యమంత్రుల, రాష్ట్ర మంత్రుల విదేశీ పర్యటనల వ్యయాన్ని రాష్ట్రాలే భరిస్తాయి. అయితే వీటి పట్ల జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విదేశీ వ్యవహారాలశాఖ వ్యవహరిస్తోంది. అది స్వంత ఖర్చుతో వ్యక్తిగత పర్యటన అయినా కూడా విధిగా కేంద్రానికి సమాచారం అందించాలనే నిబంధన ఒకటి ఉన్నది. రాష్ట్రాల నేతలు విదేశీ గడ్డపై తమ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడినా, అది జాతీయ విధానానికి భిన్నంగా ఉంటే, దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది కదా. అటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం జాగ్రత్త వహిస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మర్యాద మన్ననలతో వ్యవహరించడం ముఖ్యం. ఏ దేశంలో ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఎవరు ఏ స్థాయిలో ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు... అనే విషయమై కేంద్ర, రాష్ట్రాల అధికారిక బృందాలకు విదేశాంగశాఖ మార్గదర్శకం చేస్తుంది. విదేశాలలో ఎవరు అతిథ్యమిస్తున్నారు, ఎవరితో సమావేశమవ్వాలనుకుంటున్నారు ఇత్యాది విషయాలకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. చివరకు ఎవరైనా బహుమానం ఇస్తే స్వీకరించాలా వద్దా అనేది కూడా రాయబార కార్యాలయం నిర్దేశిస్తుంది. అవతలి వ్యక్తిని బట్టి వస్త్రధారణను సైతం సూచిస్తుంది. భారతీయ అధికార బృందాలు విదేశీ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు వారు ఏమేమి మాట్లాడారు, ఏ రకంగా వ్యవహరించారనేది కూడా పక్కన ఉండే భారతీయ దౌత్యవేత్తలు క్షుణ్ణంగా గమనిస్తూ న్యూఢిల్లీకి నివేదిస్తారు.


ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణతో విదేశీ పెట్టుబడులు, వలసలకు ప్రాధాన్యం పెరిగిన కాలమిది. భారత నాయకులు ప్రత్యేకించి ప్రతిపక్ష నేతల విదేశీ పర్యటనల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా వాటిలో సమాఖ్య స్ఫూర్తి ప్రతిబింబించాలని రేవంత్‌రెడ్డి ఉదంతంలో యూఏఈ మాజీ భారత రాయబారి కె.సి.సింగ్ వ్యాఖ్యానించడం ముదావహం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 02:37 AM