సైద్ధాంతిక రాజకీయాలు ఏవీ?
ABN , Publish Date - Aug 26 , 2026 | 02:41 AM
‘పాతికేళ్ల క్రితం నేను మీ నాన్నను కలుసుకునేందుకు మీ ఇంటికి స్కూటర్‌పై వచ్చాను గుర్తుందా?’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌కు చెందిన ఒక యువనేతను ఉద్దేశించి అన్నారు. 1991లో మురళీమనోహర్ జోషీతో పాటు...
‘పాతికేళ్ల క్రితం నేను మీ నాన్నను కలుసుకునేందుకు మీ ఇంటికి స్కూటర్‌పై వచ్చాను గుర్తుందా?’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌కు చెందిన ఒక యువనేతను ఉద్దేశించి అన్నారు. 1991లో మురళీమనోహర్ జోషీతో పాటు ఏక్తా యాత్రకు సహాయంగా వచ్చినప్పుడు ‘నీవు ఒక పిల్లవాడిగా మాకు ఫలహారాలు అందించావు’ అని ఆయన మరో నేతకు చెప్పారు. ‘2014లో నేను ప్రధాని కాకముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో యువసమ్మేళనం నీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా, అప్పుడు టికెట్ పెట్టినా భారీ ఎత్తున యువత హాజరైంది’ అని ఏపీకి చెందిన మరో నాయకుడితో మోదీ అన్నారు. కొత్తగా నియమితులైన బీజేపీ పదాధికారులతో దాదాపు నాలుగు గంటల పాటు మోదీ సమావేశమైనప్పుడు జరిగిన సంభాషణలివి. బీజేపీ పదాధికారులందర్నీ తన చుట్టూ కూర్చోబెట్టుకుని దాదాపు 50 మందితో మాట్లాడనిచ్చిన మోదీ.. మధ్య మధ్యలో వారితో తన అనుబంధాన్ని, గత స్మృతులను నెమరు వేసుకున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే కన్నీరు కార్చారు. ‘మోదీ జ్ఞాపకశక్తి అమోఘం’ అని ఒక నేత చెప్పారు. ‘కొత్త టీమ్ సమావేశం జరుగుతోంది సార్. మీరు వస్తే బాగుంటుంది అని నేనే ప్రధానికి చెప్పాను’ అని జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ చెప్పారు. ‘కెప్టెన్ ఆదేశిస్తే రాకుండా ఎలా ఉంటాను.. మీ అందర్నీ కలుసుకుంటే ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ఉన్నట్లుంటుంది’ అని మోదీ నవ్వుతూ చెప్పారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, సిద్ధాంతకర్తగా పేరొందిన రాంమాధవ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తదితర ఉద్దండులు కూడా మోదీ మాట్లాడుతుంటే తదేకంగా వింటూ కూర్చున్నారు. సమావేశం తర్వాత వారందరితో పాటు గ్రూప్ ఫొటో దిగారు. కలిసి భోజనం చేశారు. ఆశ్చర్యకమైన విషయం ఏమంటే, ఈ కీలక సమావేశంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొనలేదు.
గతంలో జగత్‌ప్రకాశ్ నడ్డా అధ్యక్షుడు అయిన తర్వాత ఆఫీసు బేరర్లను నియమించినప్పుడు మోదీ ఇలాంటి అసాధారణమైన రీతిలో వ్యవహరించలేదు. ప్రధానమంత్రి కార్యాలయానికి వారందర్నీ పిలిపించుకుని గ్రూపుల వారీగా ఫొటోలు దిగి పంపించేశారు. ఈసారి మోదీ తానే పార్టీ కార్యాలయానికి వచ్చి పాల్గొన్న ఈ సమావేశం ద్వారా పంపించిన సందేశం ఏమిటి? అందరి పుట్టుపూర్వోత్తరాల్ని పరిశీలించిన తర్వాతే వారిని తానే ఎంపిక చేశానని, ఇది తన టీమ్ అని మోదీ అప్రకటితంగానే స్పష్టం చేశారు. ప్రభుత్వానికైనా, పార్టీకైనా తానే నాయకుడినని, తానే రెండింటినీ నడిపిస్తానని, రెండో వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వనని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. రానున్న రోజుల్లో వారికి బాధ్యతలు అప్పజెప్పే విషయంలో కూడా తన హస్తం ఉంటుందని ఆయన మాటల్లో పరోక్షంగా వ్యక్తం అయింది. గడచిన కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని తన పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలని నరేంద్రమోదీ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన ఒక్కో కేంద్ర మంత్రిని పిలుచుకుని సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులకు కూడా ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ.. పార్టీని, ప్రభుత్వాన్ని కొత్త రీతిలో, సైద్ధాంతికంగా పటిష్ఠం చేసే దిశలో మోదీ నడిపించదలుచుకున్నారా అన్నది ప్రశ్న. సైద్ధాంతికంగా ఆయన పార్టీ పదాధికారులకు చెప్పింది ఏమీ లేదు. దేశంలో ప్రస్తుత వివాదాలపై దృష్టి సారించకుండా వికసిత్ భారత్ పైనే ఆలోచించాలని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లాలని, యువతను విశ్వాసంలోకి తీసుకోవాలని, నిరాడంబరంగా వ్యవహరించాలని, సోషల్ మీడియాపై దృష్టి సారించాలని ప్రోత్సహించారు. యథాప్రకారం ఆయన తన నాయకత్వాన్నే పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. సెప్టెంబర్ 17న తన పుట్టిన రోజు సందర్భంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో ఉధృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అంతేకాదు, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవాలని కూడా ఆయన నిర్ణయించారు.
బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యక్తి కేంద్రంగా ఎందుకు మారుతున్నాయి అన్న ప్రశ్నకు జవాబిచ్చే సిద్ధాంతకర్తలెవరూ ఆ పార్టీలో లేరు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మోదీ తనను తాను కథానాయకుడిగా చిత్రించి అందరిలో ఆరాధనాభావం కల్పించాలని భావిస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది. పదాధికారుల సమావేశంలో బీజేపీ చేసిన ప్రధాన తీర్మానం వందేమాతర గీతం గౌరవాన్ని పరిరక్షించాలని నిర్ణయం తీసుకోవడం. వందేమాతర గీతాన్ని రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పదాధికారుల సమావేశం తీవ్రంగా ఖండించింది.
అసలు వందేమాతర గీతం పూర్తిగా పాడాలనడం దేశంలో జనాన్ని కదిలించి బీజేపీ ఆశిస్తున్న సాంస్కృతిక జాతీయవాదానికి దారి తీస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రజల్లో, ప్రధానంగా నేటి జెన్‌జీ లో వందేమాతరం రెండు చరణాలకు పరిమితం కాకుండా పూర్తిగా పాడాలని చట్టం చేయడం ఎంత భావోద్వేగాన్ని కలిగిస్తుందనేది కూడా అంచనా వేయవలిసి ఉన్నది. చట్టం ద్వారా జాతీయ ఐక్యతను సాధించగలమా? అయినప్పటికీ ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఒక సైద్ధాంతిక వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ నిజంగా ఈ రెండు పార్టీలు ఈ సైద్ధాంతిక దృక్పథంలో లోతుగా ఆలోచించి నిజాయితీగా పనిచేస్తున్నాయా అన్నది కూడా ఆలోచించాల్సి ఉన్నది.
భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇది పోటీ పరీక్షల పత్రాల లీకేజీలు, విద్యార్థుల ఆందోళనలు, అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులోని ఆర్థిక అవకతవకల నుంచి దృష్టి మళ్లించడానికి ఉపయోగపడుతుందని వారు భావించవచ్చు. కానీ ఈ అంశాలను సజీవంగా ఉంచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. విద్యార్థుల మీద హింసాకాండపై సుప్రీంకోర్టును కవచంగా ఉపయోగించుకుని ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరి నేతృత్వంలోని కమిటీ ద్వారా సమస్య తీవ్రతను చల్లార్చేందుకు ప్రయత్నిస్తుంటే, పెల్లెట్ల ప్రయోగంపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టించారు. అయోధ్య సంఘటనపై విమర్శలను ఎదుర్కొనేందుకు బీజేపీ వందేమాతర గీతం పూర్తిగా పాడాలంటూ చట్టం చేస్తే యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ నేరుగా అయోధ్యకు వెళ్లి హనుమాన్ ఘడీ వద్ద హనుమాన్ చాలీసా పఠించారు. మరోవైపు రాహుల్‌గాంధీ పూణేలో బీజేపీ మనువాద దృక్పథంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయవాదాన్ని, దేశభక్తిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, కమలనాథులను నేటి యువతరానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చిత్రించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ రెండు పార్టీలకు జాతీయవాదం పట్ల స్పష్టత ఎంత ఉన్నదనేది చర్చనీయాంశం. నెహ్రూ రూపొందించుకున్న ఉదారవాద జాతీయవాదాన్ని సైద్ధాంతికంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ ఎంతవరకు విజయవంతం అయింది? భారతదేశ గుర్తింపు మతపరమైన సిద్ధాంతంపై కాకుండా సాంస్కృతిక బహుళత్వంపై ఆధారపడి ఉంటుందని విశ్వసించిన నెహ్రూ భావజాలాన్ని కాలానుగుణంగా అన్వయించడంలో కాంగ్రెస్ విఫలమైందన్న విషయం విస్పష్టం. అదే సమయంలో సాంస్కృతిక జాతీయవాదాన్ని, సమగ్ర మానవతావాదాన్ని ప్రతిపాదించిన దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతానికి దూరంగా బీజేపీ పయనించడం ప్రారంభించి చాలా కాలమైంది. పూర్తి స్థాయి కార్పొరేటీకరణ, విదేశీ ఆర్థిక విధానాలకు భిన్నంగా స్వదేశీ ఆర్థిక సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలని, కేంద్రీకృత పాలనను కాకుండా అన్నిస్థాయిల్లో వికేంద్రీకరణ జరపాలని, పొదుపుగా, నిరాడంబరంగా జీవిస్తూ రాజకీయాలను సేవగా మాత్రమే భావించాలని ఆయన చేసిన సూచనలను ఎంతమంది పాటిస్తున్నారు?
ఈ రెండు పార్టీలూ ఎన్నికల రాజకీయాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నాయే కానీ, తమ పార్టీల్లో సైద్ధాంతిక స్పష్టత కల్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాఖలాలు కనపడడం లేదు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మనుస్మృతిని, కులగణనను లేవనెత్తేందుకు రాహుల్ యత్నిస్తుండవచ్చు. తద్వారా బహుజనులు, ఓబీసీల ఓట్లను కాంగ్రెస్ సాధించగలదా అన్నది ప్రశ్నార్థకం. బిహార్ ఎన్నికలకు ముందు కులగణనను ప్రధానాంశంగా చేసినప్పటికీ కాంగ్రెస్ తగిన సీట్లను సాధించలేకపోయింది. అదే సమయంలో వందేమాతరం పూర్తిగా పాడకపోవడం దేశద్రోహమని, కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారా హిందూ ఓట్లను బీజేపీ సంఘటితం చేసుకోగలదా అన్నది కూడా ప్రశ్నించుకోవలిసి ఉన్నది. మనుస్మృతిని విమర్శించిన రాహుల్.. ఖురాన్, బైబిల్‌ను కూడా ఎందుకు విమర్శించలేదని హిందూవాదులు ప్రశ్నించడాన్ని ఎవరు నివారించగలరు? భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ చుట్టూ తిరుగుతున్నదని, ఆయనే అన్నిటినీ నియంత్రిస్తున్నారని విమర్శించవచ్చు కానీ, అదే పరిస్థితి కాంగ్రెస్‌లో కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ రాజకీయాలన్నీ రాహుల్‌గాంధీ, ఆయన ఉపన్యాసాల చుట్టే తిరుగుతున్నాయి. మోదీ, రాహుల్ ఇరువురూ ఇతరులతో చర్చించి వ్యాఖ్యానాలు చేయడం లేదు. తమ పార్టీలను సైద్ధాంతికంగా పటిష్ఠం చేసుకునే ఆసక్తీ ప్రదర్శించడం లేదు. వ్యక్తి కేంద్రీకృత పార్టీ రాజకీయాలు కాకుండా సిద్ధాంత ప్రాతిపదిక గల రాజకీయాల దిశన రెండు జాతీయ పార్టీలు తమను తాము తీర్చిదిద్దుకున్నప్పుడే దేశంలో ఆరోగ్యకరమైన మార్పు సాధ్యం.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News