Share News

మధ్యయుగాల చరిత్రపై ‘చెళ్లపిళ్ల’ వెలుగులు

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:31 AM

ఆంధ్ర దేశ చరిత్రను శాసనాలు, నాణేలు, తాళపత్రాలు, రాగిరేకులు, కైఫియత్తుల వంటి ప్రాథమిక ఆధారాల ద్వారా అధ్యయనం చేసి, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి భవిష్యత్ తరాలకు అందించిన ప్రముఖ చరిత్రకారుడు...

మధ్యయుగాల చరిత్రపై ‘చెళ్లపిళ్ల’ వెలుగులు

ఆంధ్ర దేశ చరిత్రను శాసనాలు, నాణేలు, తాళపత్రాలు, రాగిరేకులు, కైఫియత్తుల వంటి ప్రాథమిక ఆధారాల ద్వారా అధ్యయనం చేసి, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి భవిష్యత్ తరాలకు అందించిన ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు ప్రొఫెసర్ చెళ్లపిళ్ల సోమసుందరరావు. చరిత్రను రాసిన వ్యక్తిని స్మరించుకోవడం అంటే ఆయన పేరును గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు, ఆయన చూపిన పరిశోధనా మార్గాన్ని కొనసాగించడం. ఆగస్టు 18న ఆయన మరణించడం ఆంధ్ర చరిత్ర పరిశోధనా రంగానికి, విశ్వవిద్యాలయ విద్యా ప్రపంచానికి, ముఖ్యంగా చరిత్రను ఒక శాస్త్రీయ అధ్యయనంగా భావించే పరిశోధకులకు తీరని లోటు. ఆంధ్రదేశ చరిత్రలో ఇంకా వెలుగులోకి రావాల్సిన అనేక శాసనాలు, మరుగునపడిన పురావస్తు ప్రదేశాలు ఉన్నాయి. గ్రామాల చరిత్రల్లో దాగి ఉన్న అనేక కథనాలు ఉన్నాయి. దేవాలయాలు, శిల్పాలు, నాణేలు, శాసనాలు, జానపద సంప్రదాయాలు ఇంకా పరిశోధన కోసం ఎదురుచూస్తున్నాయి.

సోమసుందరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలోని చరిత్ర–పురావస్తు విభాగంలో అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా సేవలందించారు. చరిత్ర రచనలో ఊహలకు, పుకార్లకు స్థానం ఉండకూడదని, లభ్యమయ్యే ప్రాథమిక ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశీలించి గతాన్ని పునర్నిర్మించాలనే శాస్త్రీయ దృక్పథం ఆయన పరిశోధనల్లో కనిపిస్తుంది. ఆంధ్రదేశంలోని ప్రాచీన, మధ్యయుగ చరిత్రను పునర్నిర్మించడంలో శాసన ఆధారాలను వినియోగిస్తూ ఆయన అనేక కొత్త వ్యాఖ్యానాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా శాతవాహనుల కాలక్రమంపై ఆయన చేసిన పరిశోధన దక్షిణ భారత చరిత్రలో చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న సమస్యకు కొత్త దృక్కోణాన్ని అందించింది. సంగమ వంశానికి చెందిన విరూపాక్షుని సోరైక్కవూరు రాగిరేకుల్లో పేర్కొన్న గ్రామాలను గుర్తించడం, కాకతీయులు, కోన హైహేయులకు సంబంధించిన ఖండవల్లి రాగిరేకులకు నూతన వ్యాఖ్యానాలు ఇవ్వడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనాలు. ఖండవల్లి శాసనాల అధ్యయనంలో కనిపించే ప్రత్యేకమైన ‘దయా–గజ–కేసరి’ బిరుదు, కోన హైహేయుల ముద్రపై కనిపించే వైష్ణవ చిహ్నాలను కూడా ఆయన విశ్లేషించారు.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల గురించి తెలుగు సాహిత్య చరిత్రలో స్థిరపడిన కొన్ని సంప్రదాయ అభిప్రాయాలను కూడా సోమసుందరరావు శాసన ఆధారాలతో పునఃపరిశీలించారు. సాహిత్య సంప్రదాయ ఆధారాలను మాత్రమే తీసుకోకుండా శాసనాలలో లభించే కాలనిర్ణయ ఆధారాలను పరిశీలించి అష్టదిగ్గజాల కాలక్రమాన్ని పునరాలోచించాల్సిన అవసరాన్ని ఆయన శోధించారు. చరిత్ర పరిశోధనలో ఆధారాల ప్రాముఖ్యాన్ని స్పష్టంగా చాటిన పరిశోధనా విధానం ఇది. తూర్పు గాంగులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, కోన హైహేయులకు చెందిన అనేక రాగిరేకు శాసనాలను ఆయన సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో చరిత్రకారులకు పరిచయం చేశారు. శాసన పరిశోధనను కేవలం నిపుణుల పరిధిలో ఉంచకుండా విద్యార్థులు, యువ పరిశోధకులు, చరిత్రాభిమానులకు అందుబాటులోకి తీసుకురావడం ఆయన చేసిన మరో ముఖ్యమైన కృషి. శాసన పరిశోధనలో ఆయనకున్న ప్రావీణ్యానికి ‘ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే గ్రంథం ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇందులో తెలుగు లిపి పరిణామం, బ్రాహ్మీ నుంచి తెలుగు–కన్నడ సంప్రదాయం వరకు లిపి వికాసం, పాలియోగ్రఫీ పట్టికలు, ఛాయాచిత్రాలు, తేదీలతో కూడిన శాసన ఉదాహరణలు వంటి అంశాలను విపులంగా వర్ణించారు. సోమసుందరరావు రచించిన పరిశోధనా వ్యాసాలు ‘ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్’, ‘సౌత్ ఇండియన్ న్యుమిస్ మ్యాటిక్స్ సొసైటీ’, ‘ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్’, ‘ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలు, ప్రచురణల్లో వెలువడ్డాయి. ఆయన రచనలను ఒకచోట చేర్చి 2019లో ‘స్టడీస్ ఇన్ ఆంధ్ర హిస్టరీ అండ్ కల్చర్’ గ్రంథంగా ప్రచురించారు.


సోమసుందరరావు పరిశోధనా ఆసక్తిలో ప్రాచీన ఆంధ్ర చరిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఉన్న చారిత్రక అభిప్రాయాలను యథాతథంగా స్వీకరించకుండా, కొత్త ఆధారాల వెలుగులో వాటిని పునఃపరిశీలించడం ఆయన పద్ధతిలోని ముఖ్యమైన లక్షణం. ఆయన రచించిన ‘మిడీవల్ ఆంధ్రప్రదేశ్ ఎ.డి. 1000–1324’ ఆంధ్ర మధ్యయుగ చరిత్ర అధ్యయనంలో ప్రాముఖ్యం పొందిన గ్రంథం. విశ్వవిద్యాలయ చరిత్ర పాఠ్య ప్రణాళికల్లో కూడా ఇది సూచిత గ్రంథంగా కనిపిస్తుంది. మధ్యయుగ ఆంధ్రదేశంలోని రాజకీయ పరిణామాలతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను కూడా అధ్యయనం చేయడం ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో వివిధ రాజవంశాల ఎదుగుదల, సామంత వ్యవస్థలు, సమాజ నిర్మాణం, దేవాలయ వ్యవస్థ, కుల–వర్గ సంబంధాలు వంటి అంశాలను చరిత్రలో భాగంగా పరిశీలించారు. అంతేగాక, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రపై వెలువడిన సమగ్ర గ్రంథ సంపుటిలో కూడా ఆయన సంపాదకుడిగా, రచయితగా భాగస్వామ్యం వహించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌తో చాలా దగ్గర అనుబంధం ఉంది.

చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు, రాజవంశాల వరుస కాదని; దేవాలయాలు, సామాజిక వర్గాలు, కుల నిర్మాణం, ఆర్థిక సంబంధాలు, ప్రజల జీవన విధానాలు కూడా చరిత్రలో అంతర్భాగాలేనని ఆయన పరిశోధన సూచిస్తుంది. ఒక చరిత్రకారుడి గొప్పతనం ఆయన రాసిన పుస్తకాల సంఖ్యలో మాత్రమే ఉండదు. ఆయన తరువాతి తరానికి అందించిన పరిశోధనా దృష్టిలో ఉంటుంది. శాసనాలను చదివి వాటి వెనుక ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం, రాజవంశాల ఉత్థాన పతనాల వెనుక ఉన్న సామాజిక–ఆర్థిక సంబంధాలను వెలికితీయడం, చరిత్రను ఆధారాలతో పునర్నిర్మించడం ఆయన పరిశోధనా జీవితానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. దీనికి నిదర్శనంగా ఇటీవలే తమిళ్ హెరిటేజ్ ట్రస్ట్ వారు వి.వెంకయ్య స్మారక అవార్డుకు ఈయనను ఎంపిక చేశారు. ఆంధ్ర చరిత్ర పరిశోధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన స్మృతి చరిత్ర పరిశోధకులకు సదా స్ఫూర్తిదాయకం.

డాక్టర్ గోవిందు సురేంద్ర

(ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్)

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 02:31 AM