వానను ఒడిసిపట్టే యాగం ఎప్పుడు?
ABN , Publish Date - Aug 26 , 2026 | 02:33 AM
ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మనం వాన కోసం ప్రార్థించాలా? లేక పడిన కొన్ని చినుకులనైనా వృథా కాకుండా ఒడిసిపట్టాలా? వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుణ యాగం...
ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మనం వాన కోసం ప్రార్థించాలా? లేక పడిన కొన్ని చినుకులనైనా వృథా కాకుండా ఒడిసిపట్టాలా? వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుణ యాగం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కోసం ప్రార్థనలు చేయడం మన సంప్రదాయంలో భాగమే. ప్రకృతిని దేవతగా భావించి వర్షాన్ని కోరుకోవడం అనాదిగా వస్తున్న విశ్వాసం. అయితే వ్యక్తిగత విశ్వాసం ఒకటి, ప్రభుత్వ పాలనలో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానం మరొకటి.
యాగం లేదా ప్రార్థన వల్ల వర్షం కురుస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. రుతుపవనాల కదలిక, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ పీడన వ్యవస్థలు, గాలుల దిశ, ఎల్‌నినో వంటి సముద్ర వాతావరణ పరిణామాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ప్రక్రియలను మనిషి తన ప్రార్థనలతో నియంత్రించలేడు. కానీ వర్షం పడిన తర్వాత ఆ నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత నీటిని భూమిలోకి ఇంకించాలి, ఎంత నీటిని నిల్వ చేయాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. వర్షం తక్కువగా పడినప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటాం. భారీ వర్షం పడినప్పుడు వరదలను ఎదుర్కొంటాం. ఒకే సమయంలో ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నామంటే సమస్య వర్షంలోనే లేదని అర్థం. వర్షపు నీటిని నిర్వహించడంలో మన వైఫల్యం ఉంది. ఇలాంటి వైఫల్యాలను అధిగమించిన రైతుల చరిత్ర తెలంగాణలో ఉంది.
వాననీటిని ఒడిసిపడితే భూగర్భదాహం తీరుతుందని సంగారెడ్డి జిల్లా, కోహీర్ మండలంలోని గొడిగార్‌పల్లి రైతులు నిరూపించారు. అక్కడ సాగుభూమి 1200 ఎకరాలు. ఒకప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. చినుకులు పడితే పంట, లేదంటే వలసలే. అలాంటి కరువు నేలలో 2019లో ఐక్యరాజ్యసమితి సలహాదారు టి.హన్మంతరావు ఆ గ్రామస్థులను జల సంరక్షణలో భాగస్వాములను చేశారు. చతుర్విధ జలప్రక్రియ అనే ప్రాజెక్ట్‌ను అమలు చేశారు. అవి– 1. వాన నీరు 2. ఉపరితల నీరు 3. భూగర్భ నీరు 4. భూమిలో తేమను ఎలా పెంచి వినియోగించుకోవాలో చెప్పే శాస్త్రీయ పద్ధతి. ఈ ప్రక్రియలో భాగంగా వాన నీరు భూమిలో ఇంకేలా, ప్రవహించే నీరు లోతట్టుకు వెళ్లకుండా వాలుకు అడ్డంగా చిన్న గుంతలు, కందకాలు తవ్వారు. భూగర్భ జలాలు పెంచడానికి ఊట గుంతలు, పంట కుంటలు తవ్వారు. ఇదంతా గ్రామస్థుల శ్రమదానంతో చేసుకున్నారు. దీనివల్ల పడిన వర్షం అంతా ఊరి పొలిమేరలు దాటకుండా వారి పొలాల్లోనే ఇంకుతుంది. ఫలితంగా గ్రామంలోని బోర్లలో నీటి మట్టం పెరిగింది, ఇప్పుడు వారు మూడు పంటలు పండిస్తున్నారు. వానలు సకాలంలో పడనప్పుడు కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా సేద్యం చేస్తున్నారు. తెలంగాణ రైతులు అనుసరించిన చతుర్విధ జలప్రక్రియ రాజస్థాన్‌కు స్ఫూర్తినిచ్చింది. ఇదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేయాలి.
ఒక భారీ వర్షం కురిసి గంటల్లోనే ఆ నీరు వరదలా పారి వృథాగా పోయే కంటే, అదే నీటిని చిన్న చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, కాంటూర్ ట్రెంచ్‌లు, పర్కొలేషన్ ట్యాంకులు, చెరువుల ద్వారా భూమిలోకి పంపడం ఎంతో విలువైనది. వర్షాన్ని కురిపించడం మన చేతుల్లో లేకపోవచ్చు. కానీ వర్షాన్ని భూమిలోకి పంపించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రభుత్వం వర్షాల కోసం ఒక యాగం నిర్వహించినప్పుడు, అదే సమయంలో రాష్ట్రంలోని ఎన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు? ఎన్ని చెరువులను పూడిక తీసి పునరుద్ధరిస్తున్నారు? ఎన్ని చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు? ఎన్ని ఫామ్ పాండ్లను ప్రోత్సహిస్తున్నారు? ఎన్ని ప్రభుత్వ భవనాల్లో పైకప్పు వర్షపు నీటిని భూగర్భజలాల్లోకి పంపిస్తున్నారు? ఈ ప్రశ్నలే శాస్త్రీయ పాలనకు కొలమానాలు కావాలి.
తెలంగాణకు నీటిని నిల్వ చేసుకునే గొప్ప సంప్రదాయం ఉంది. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, కట్టలు మన పూర్వీకులు అభివృద్ధి చేసిన స్థానిక నీటి విజ్ఞానానికి ప్రతీకలు. కాకతీయుల చెరువుల వ్యవస్థ నుంచి గ్రామీణ కుంటల వరకు, తెలంగాణ భూభాగం వర్షపు నీటిని పట్టుకోవడానికి అనేక స్థానిక పద్ధతులను అభివృద్ధి చేసుకుంది. ప్రకృతితో కలిసి జీవించాల్సిన అవసరాన్ని అప్పటి సమాజం అర్థం చేసుకుంది. కానీ కాలక్రమంలో పట్టణీకరణ, చెరువుల ఆక్రమణలు, సహజ వాగుల మూసివేత, కాంక్రీట్ విస్తరణ, భూమిలోకి నీరు ఇంకే ప్రదేశాల తగ్గుదలతో పరిస్థితి మారిపోయింది. ఫలితంగా ఇప్పుడు వర్షం పడితే ఒకవైపు వరద, వర్షం ఆగితే మరోవైపు నీటి కొరత. ఇది కేవలం వర్షం సమస్య కాదు. ఇది నీటి నిర్వహణ సమస్య.
హైదరాబాద్ వంటి నగరాల్లో వర్షపు నీటి సంరక్షణకు మరింత ప్రాధాన్యం అవసరం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి. ప్రతి పాఠశాలలో ఒక నమూనా రీచార్జ్ పిట్ ఏర్పాటు చేయాలి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో వర్షపు నీటి నిర్వహణ తప్పనిసరి కావాలి. ప్రతి పట్టణంలో చెరువులు, నాలాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను రక్షించాలి. వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్డుపై నిలిచిపోవడం కాదు, భూమిలోకి చేరేలా పట్టణ ప్రణాళిక ఉండాలి. ప్రజలకు నీరందించే బాధ్యత ప్రభుత్వానిది. వర్షం వచ్చినప్పుడు ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చూసే వ్యవస్థను నిర్మించాలి. వర్షం తక్కువైతే రైతును ఆదుకునే ప్రణాళిక ఉండాలి.
మత విశ్వాసాన్ని అవమానించాల్సిన అవసరం లేదు. సంప్రదాయాన్ని తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదు. కానీ సంప్రదాయ విశ్వాసాన్ని శాస్త్రీయ నీటి నిర్వహణకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టకూడదు. ప్రార్థన మనసుకు ధైర్యం ఇవ్వవచ్చు. కానీ ఇంకుడు గుంత భూమికి నీటిని ఇస్తుంది.
శ్యాంమోహన్
(జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News