Share News

ఊళ్లు విడిచినా చదువు ఆగదు

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:58 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముంపు ప్రజలు గ్రామాలు వదిలి వెళ్తున్నందున విద్యకు అటంకం ఏర్పడకూడదన్న సంకల్పంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించింది.

ఊళ్లు విడిచినా చదువు ఆగదు
సుంకేసుల ప్రాథమిక పాఠశాలను కొనసాగించనున్న మార్కాపురం పట్టణంలోని మునిసిపల్‌ స్కూల్‌

వెలిగొండ ముంపు గ్రామాల విద్యార్థులకు భరోసా

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

వివరాలను వెల్లడించిన డీఈవో సుబ్బారావు

మార్కాపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముంపు ప్రజలు గ్రామాలు వదిలి వెళ్తున్నందున విద్యకు అటంకం ఏర్పడకూడదన్న సంకల్పంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించింది. వెలిగొండ కింద మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు మండలాల్లోని 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడి ప్రజలకు పరిహారం అందించిన ప్రభుత్వం వారిని ఊళ్లు వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చింది. ఈనెల 31న వెలిగొండ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు నీళ్లు నింపే కార్యక్రమం ప్రారంభించనుండటంతో గ్రామాలను నిర్వాసితులు ఖాళీ చేస్తున్నారు. అదేసమయంలో ఆయా గ్రామాల్లోని 10 పాఠశాలల్లో 769 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గ్రామాలను కుటుంబాలు ఖాళీ చేస్తున్నందున పిల్లల విద్యపై ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లోని పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా విద్యాశాఖ పలు చర్యలు తీసుకుంటోంది. వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌. సుబ్బారావు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ పాఠశాలలు ఇలా..

పెద్దారవీడు మండలం సుంకేసుల ఉన్నత పాఠశాలలో 216 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరందరినీ మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలోని పాఠశాలలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న తరగతులకుఅదనంగా ఐదు గదులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సుంకేసుల ఉన్నత పాఠశాల కోసం వినియోగించనున్నారు. సుంకేసుల ప్రాథమిక పాఠశాలను మార్కాపురం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లోని పాఠశాలల్లోనూ, సుంకేసుల స్పెషల్‌ పాఠశాలను తోకపల్లి యూపీ స్కూల్‌లో కొనసాగిస్తారు. కలనూతలలోని రెండు పాఠశాలలను దరిమడుగు వద్ద ఉన్న స్కూల్‌లో కొనసాగిస్తారు. కె.నాగులవరం పాఠశాలలోని విద్యార్థులను దేవరాజుగట్టు ప్రాథమిక పాఠశాలలో చేరుస్తారు. గుండంచర్ల స్కూల్‌ను గొబ్బూరు ప్రాథమిక పాఠశాలలోనూ, గొట్టిపడియ, అక్కచెరువులోని విద్యార్థులను కె.కొత్తపల్లి, కోలభీమునిపాడు పాఠశాలల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా సర్దుబాటు చేసేందుకు ఆయా పాఠశాలల్లోని రికార్డులు, సామగ్రిని నేడో, రేపో పూర్తి స్థాయిలో తరలించనున్నారు. నిర్వాసిత గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా వారికి ప్రత్యామ్నాయంగా చూపిన పాఠశాలల్లో పనిచేస్తారని డీఈవో సుబ్బారావు చెప్పారు.

జిల్లాలో ఏ పాఠశాలలోనైనా చేరవచ్చు

ముంపు గ్రామాలను వదిలి బయటకు వస్తున్న కుటుంబాలన్నీ మార్కాపురం పరిసరాల్లోనే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి బంధువులు, ఇతర గ్రామాల్లో వసతులు చూసుకుని వెళ్లిపోయారు. అటువంటి వారికోసం విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ఏ గ్రామంలో ఉన్నా నిర్వాసిత కుటుంబాల్లోని పిల్లలు జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా చేర్చుకునేలా అందరు ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చామని డీఈవో చెప్పారు.

వసతి గృహాల్లోనూ అవకాశం

తమ పిల్లలను చదివించుకునే స్థోమత లేదని భావించే తల్లిదండ్రులు వారిని వసతి గృహాల్లో ఉంచి చదివించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని పెద్దారవీడు, వైడీపాడు, దోర్నాల, మార్కాపురంలలో ఉన్న వసతిగృహాల్లో దాదాపు 412 మంది పిల్లలను చేర్చుకునే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. నిర్వాసితులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్చాలనుకున్నా వారికి ఆ సౌకర్యం కూడా కల్పించబోతున్నామని డీఈవో సుబ్బారావు చెప్పారు. నిర్వాసితుల పిల్లల చదువులు ఆగిపోకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

Updated Date - Aug 26 , 2026 | 02:58 AM