తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 08:00 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన షేక్ బిలాల్(27), షేక్ సుల్తాన్ (20), మహ్మద్ అర్పద్ (18) పని నిమిత్తం బొబ్బర్లంకకు వెళ్లారు.
అయితే, అక్కడ స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో నదిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నదిలో కొట్టుకుపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా కాసేపటికి షేక్ బిలాల్ మృతదేహం లభించింది.
షేక్ సుల్తాన్, మహ్మద్ అర్పద్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, షేక్ సుల్తాన్ బీటెక్ చదువుతుండగా.. మహ్మద్ అర్పద్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ వారు నదిలో కొట్టుకుపోయారని తెలుసుకుని బాధిత కుటుంబాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారి రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
ఏఐ సమ్మిట్‌ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర