Share News

పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:15 PM

పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదో తరగతి చదువుతోన్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Polavaram district news

పోలవరం, జులై 27: జిల్లాలోని రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదో తరగతి చదువుతోన్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా బాలిక విగతజీవిగా ఉరికొయ్యకు వేలాడ్డం చూసి గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని.. మూడు రోజుల కిందట రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంది. ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేయడంతో పాటు.. షైనింగ్ స్టార్‌ను అవుతానని, అవార్డును సీఎం చేతులతోనే తీసుకుంటానంటూ విద్యార్థిని చెప్పింది. బాలిక మాటలకు పరవశించిన చంద్రబాబు.. ఆమెతో సెల్ఫీ దిగి, రాబోయే రోజుల్లో తనకు రిపోర్ట్ చేయాలని సరదాగా సంభాషించారు. శివాని చదువులో టాపర్‌ అని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. అన్నింట్లో చలాకీగా ఉండే శివాని ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


శివాని మరణం నన్ను కలిచివేసింది: సీఎం చంద్రబాబు ఆవేదన

పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘పోలవరం జిల్లా ఇర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్థిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం’ అంటే ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

దేశం ప్రశాంతంగా ఉండటానికి కారణం జవాన్లే: పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు మణిహారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 01:33 PM