Share News

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:08 PM

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పవరం ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ను ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు నుంచి తొలగించారు.

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం
Ananthababu Case Update

అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై ABN ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాల అనంతరం పోలీసు శాఖ చర్యలు తీసుకుంది.


సర్పవరం ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. వెంటనే ఆయన వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించినట్లు అనంతబాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. మంగళవారం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లేలోపే అనంతబాబు పరారైనట్లు సమాచారం.


పోలీసుల నుంచి ముందుగానే సమాచారం అందడంతోనే ఆయన తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఇన్‌ఛార్జ్ సీఐ రవికుమార్‌ను కేసు విచారణ నుంచి తొలగించారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

హైకోర్టును ఆశ్రయించిన అనంతబాబు

ఇదిలా ఉండగా.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు(ఏప్రిల్ 24న) హైకోర్టు విచారణ జరగనుంది.


ఇవి కూడా చదవండి:

సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత

పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

Updated Date - Apr 23 , 2026 | 08:43 PM