పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:57 PM
అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని.. ఈ జిల్లాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్ అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
అనకాపల్లి, ఏప్రిల్ 23: విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. ఈరోజు(గురువారం) అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం.. రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను అదృష్టం వరించిందని.. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని.. ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం అన్నారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తామని తెలిపారు. ఏడాదిలోగా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం...
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతే జరిగిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని వైసీపీ కుప్పకూల్చిందని మండిపడ్డారు. జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని.. ఉచితంగా కరెంట్ వచ్చే సోలార్‌ను వినియోగించుకోలేదన్నారు. విద్యుత్ సంస్థలపై రూ.12 వేల కోట్ల భారం మోపారన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కిపోయాయని సీఎం అన్నారు. సొంత బాబాయ్‌నే చంపిన చిల్లర పార్టీ వైసీపీ అంటూ మండిపడ్డారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని చెప్పారని.. పోస్టుమార్టం తర్వాత గొడ్డలిపోటుగా తేలిందన్నారు. వాళ్లే నేరం చేసి.. ఆ పాపాన్ని తమపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనం నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం..
‘ఏపీ పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పాం.. చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పామన్నారు. తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి జరగాలని.. సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతులే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని చెప్పుకొచ్చారు. రెండుమూడేళ్లలో 40 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ కరెంట్ అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సోలార్ అమర్చుకోండి.. రాయితీ ఇస్తాం
ఏపీకి ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని.. 22 నెలల్లో 800కి పైగా ప్రాజెక్టులు వచ్చాయని సీఎం తెలిపారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. గ్రీన్ ఎనర్జీతోనే ఏపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని.. అన్ని బస్సులను ఏసీ బస్సులుగా మారుస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ‘ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోండి.. రాయితీ ఇస్తాం’ అని ప్రకటించారు. 23 లక్షల మంది రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రూ.4 వేల కోట్లకుపైగా ట్రూడౌన్ ఛార్జీల భారం తగ్గించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి
సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News