ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది: తలసాని శ్రీనివాస్
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:09 PM
తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని.. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో ముందు కార్మికులతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని.. అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని.. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని ఆనాడు కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. కానీ ప్రభుత్వం మారిందని తెలిపారు.
ఆర్టీసీకి ఎంతో ప్రాముఖ్యం ఉందని తలసాని చెప్పుకొచ్చారు. రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు వెనకుండి సమ్మె చేయిస్తున్నారని ఓ మంత్రి అంటున్నారని.. అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీరిస్తే సమ్మె ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సమ్మె చేసే ఉద్యోగులను ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అందరం కలిసి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్దామని.. ప్రభుత్వం మెడలు వంచి హామీలను సాధిద్దామని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.
పీఆర్సీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గుర్తుచేశారు. ఎలక్ట్రికల్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నారని.. ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్లకు ఎలక్ట్రికల్ బస్సు నడపడం రాదా అని నిలదీశారు. ‘మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు. మీ వెనుక మా పార్టీ మొత్తం ఉంది’ అంటూ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సమావేశం అయిన వెంటనే ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. హామీల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాలన్నారు. తూతూ మంత్రంగా ఒప్పుకోవద్దని జేఏసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. 29 డిమాండ్లు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారని.. మరి ఆ 29 డిమాండ్లు ఏంటో మీడియా సాక్షిగా విడుదల చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: రాంచందర్ రావు
Read Latest Telangana News And Telugu News