హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ చామల కిరణ్
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:27 PM
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్.. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23: కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే సంబరాల రాంబాబులను లోపలేస్తామని హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తన సొంత బ్రాండ్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని.. తెలంగాణ సొమ్మును నాశనం చేశారని ఆరోపించారు. బ్రాండ్ కోసమే కేసీఆర్ తట్టెడు అబద్ధాలు, పిట్ట కథలు చెప్పారని మండిపడ్డారు. రెండు సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందని ఎంపీ ప్రశ్నించారు.
‘24 గంటల్లో సినిమా చూపిస్తామన్న బీజేపీ ఎక్కడికి పోయింది? సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతోంది? బీజేపీ నాయకులు వెంటనే సీబీఐతో విచారణ చేయించండి’ అని డిమాండ్ చేశారు. మానిపోయిన గాయానికి మళ్లీ మందు పెట్టేందుకు కేసీఆర్ బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్.. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపీ తెలిపారు. కాళేశ్వరంలో దోపిడీ చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ గుండెకాయ అన్నారని.. మేడిగడ్డ కుంగిపోయాక కాళేశ్వరం కూలిపోయినట్టే కదా అని ఎంపీ అడిగారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కూలిపోయిందన్నారు. నాణ్యత పాటించకుండా ప్రాజెక్ట్ కట్టి.. కూలిపోగానే కాంగ్రెస్‌పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పు పట్టలేదని తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విచారణకు రమ్మన్న అంశంపై మాత్రమే కోర్టు అభ్యంతరం తెలిపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అప్పు పుట్టకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తెచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News