గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:53 PM
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
రాజమండ్రి, జులై 13: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని.. కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్‌లో 72 శాతం పనులను పూర్తి చేశామని.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయన్నారు. పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. రెండేళ్లలో సాగునీటి కోసం రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని.. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేశామని చెప్పుకొచ్చారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఎక్కువని అన్నారు. పవన్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిందని.. ముంబై వెళ్లి ఆయనను పరామర్శించినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాకే విధుల్లోకి రావాలని పవన్‌కు చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్‌టైమ్ ఛాన్స్
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News