కల్తీ నెయ్యి కేసులో క్లీన్చిట్ ఎవరిచ్చారు.. జగన్‌కు కేంద్ర మంత్రి సూటిప్రశ్న
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:26 PM
మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంలో క్లీన్‌చిట్ ఇచ్చినట్టు జగన్ చెబుతున్నారని.. ఎవరిచ్చారో చూపించాలన్నారు.
తిరుపతి, ఫిబ్రవరి 7: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బీజేపీ సరిగ్గా స్పందించటం లేదని చెప్పటం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Union Minister Bhupatiraju Srinivasa Varma) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల్లా తాము అమ్మనాబూతులు తిట్టాలా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. భోలేబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డెయిరీ లేదని.. కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు చెప్తున్నారని.. కానీ ఎవరిచ్చారో చూపించాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
వారికి శిక్ష తప్పదు..
టీటీడీలో టెండర్ల నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారని శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఆ నెయ్యితోనే స్వామి వారికి దీపం పెడతారని, హారతి ఇస్తారని.. అలాంటి నెయ్యిని కల్తీ చేశారని ఆయన అన్నారు. 2022లోనే రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారని నిలదీశారు. ఒక లీటరు పాలు కూడా సేకరించని వారికి నిబంధనలను మార్చేసి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ద్వారా బయట పడిందన్నారు. సిట్ తుది నివేదికలో ఆ రిపోర్టును ట్యాంపరింగ్ చేసి ఉంటే అలాచేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి శ్రీనివాస వర్మ హెచ్చరించారు.
సంపూర్ణ సహకారం..
దేశంలో ఎక్కడ చూసినా హైవేలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా 7 హైస్పీడ్ కారిడార్‌లను కేంద్రం ప్రకటించిందని, ఏపీ నుంచి 3 కారిడార్‌లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన హామీ ఇచ్చారు. బడ్జెట్‌పై అసత్య ప్రచారాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. కోకో జీడిపప్పు, కొబ్బరి ఉత్పత్తులకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు
ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య
Read Latest AP News And Telugu News