Tirumala: తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర.. ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:39 PM
తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు.
తిరుమల, జనవరి 07: తిరుమల పవిత్రతను దెబ్బతీసే లక్ష్యంతో జరిగిన కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. ఈ కుట్ర కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి పోలీసులు వెల్లడించారు. స్థానిక కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కుట్రపూరితంగానే మద్యం బాటిళ్లను గెస్ట్ హౌస్ వద్ద పడేశారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. వైసీపీ అధికారిక మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు తమకు ఆధారాలు లభ్యమైనాయన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి.. తద్వారా టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు వైసీపీ నేతలు ఈ నీచానికి పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఏకంగా శ్రీవారి కొలువుదీరిన క్షేత్రంలోనే ఈ నీచమైన కుట్రలకు వైసీపీ నేతలు తెర తీసినట్లు చెప్పారు. అందుకు సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్ట్, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారాలతోపాటు ఇతర టెక్నాలజీని వినియోగించి.. నిందితుల కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. మద్యం సీసాలపై ఉన్న ఆధారాలతో పాటు బాటిళ్లు కొనుగోలు చేసిన వైన్ షాపుల నుంచి ఆధారాలను సేకరించినట్లు పోలీసులు వివరించారు. ఈ కుట్ర కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని.. వారిలో వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News