ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:25 PM
2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు.
తిరుపతి, జూన్ 12: 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తైన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. 2024లో 57 శాతం ఓట్ షేర్.. 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు.
జగన్ చేసిందేమీ లేదు...
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందన్నారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీలేదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి దశలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చిందన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అన్ని వర్గాలనూ ఆదుకున్నాం..
ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 63 లక్షల మందికి NTR భరోసా పెన్షన్లు అందజేశామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తున్నామన్నారు. రైతులు, గీత కార్మికులు, వడ్డెర్లు, చేనేతలు సహా అన్ని వర్గాలను ఆదుకున్నామని తెలిపారు. P4 ప్రయోగంతో ఆర్థిక అసమానతలను తగ్గించామన్నారు.
21వ శతాబ్దం ప్రధాని మోదీదే..
21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని సీఎం స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశానికి మోదీ ఆత్మస్థైర్యం ఇచ్చారన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనలో భారత్ ప్రతిష్ఠ పెరిగిందని వెల్లడించారు. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌జెట్ తయారుకాబోతోందన్నారు. తిరుపతిలో బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తోందని, రాయలసీమ ఇప్పుడు బంగారుసీమ కాబోతోందన్నారు. వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. జొన్నవాడలో బంగారం వెలికితీస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తున్నామని తెలిపారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ముఖచిత్రాన్ని కాపాడతామన్నారు. కల్యాణి డ్యామ్‌కు ఈ ఏడాది నీళ్లు తీసుకొస్తున్నామన్నారు. 3 రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారని మండిపడ్డారు. ‘3 రాజధానులు కాదు.. 3 ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం’ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News