Share News

ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:59 PM

స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

తిరుపతి, జనవరి 24: స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. అది మన జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. శనివారం నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన లెగసీ వేస్ట్‌ను ఏడాదిన్నరలో పూర్తిగా తొలగించామని చంద్రబాబు తెలిపారు.


స్వచ్ఛమైన ఆలోచనలతోనే భవిష్యత్..

పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో ఇప్పటికే ప్లాంట్లు పనిచేస్తున్నాయన్నారు. రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులోనూ నూతన ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాలు తయారుచేసిన కంపోస్ట్‌ను రైతులకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు.


ఓడీఎఫ్ ప్లస్ దిశగా అడుగులు..

ఐదేళ్లలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేలా స్వచ్ఛాంధ్రను తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రను నడిపిస్తున్నామని చెప్పారు. మార్చి నాటికి 1.12 కోట్ల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌ను ఓడీఎఫ్(ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ)గా నిలబెట్టామని, ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.


నగరిలో విస్తృత పర్యటన..

అంతకముందు.. నగరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన చేపట్టారు. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నగరి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాలను అందజేసి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కార్మికులను అభినందించారు.

ఆ తర్వాత స్టాల్స్‌ను సందర్శించిన సీఎం.. ప్రకృతి వ్యవసాయం విషయంలో అధికారులను ప్రశ్నించారు. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరికి 5000 ఎకరాలతో ఎకనమిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమశిల నుంచి స్వర్ణముఖి ప్రాజెక్టు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గానికి కృష్ణమ్మ నది నీటిని తీసుకురావాలని కోరారు. తాగునీటిలో రంగు కలుస్తున్న సమస్య ఉందని, దానికి త్వరితగతిన పరిష్కారం చూపాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే.


ఇవి కూడా చదవండి...

నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

4 రోజులు 45 భేటీలు.. లోకేశ్ దావోస్ టూర్ సక్సెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 03:30 PM