నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:31 AM
నూతన వాహనాల కొనుగోలుదారులు వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ద్విచక్రవాహనాలు, కార్లకు మాత్రమే
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నూతన వాహనాల కొనుగోలుదారులు వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనాన్ని కొనుగోలు చేసిన షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే సదుపాయాన్ని రవాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.
అయితే, ద్విచక్రవాహనాలు, కార్లు రిజిస్ట్రేషన్‌లు మాత్రమే సంబంధిత షోరూంలో చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం రవాణా శాఖ కార్యాలయంలోనే జరుగుతాయి. షోరూంలోనే ద్విచక్రవాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే నిర్ణయాన్ని రవాణా శాఖ జనవరి 8న తీసుకుంది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అధికారులు 15 రోజుల్లోనే సిద్ధం చేశారు.
అంతేకాక, ఆ సాఫ్ట్‌వేర్‌ను ఓ కారు షోరూంలో శుక్రవారం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సదరు షోరూం నుంచి ఎలివేట్ జెడ్ ఎక్స్ ఎంటీ మోడల్ కారు కొనుగోలు చేసిన వాహనదారుడికి డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలను వాహనదారుడికి జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ అందించారు. కాగా, నూతన విధానం అమలుపై రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తి 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. సాఫ్ట్‌వేర్ వినియోగంపై అవగాహన కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి: