పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ స్వాగతం
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:02 AM
చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీశాఖ అధికారులు తరలిస్తున్నారు. మన్యం జిల్లాకు వెళ్లే మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి.
చిత్తూరు, జులై 24: పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీశాఖ అధికారులు తరలిస్తున్నారు. సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంపుకు తరలించనున్నారు. మన్యం జిల్లాకు వెళ్లే మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు రెండు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులకు స్వాగతం పలికి, ఆహారం అందించారు. అనంతరం మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు ఏనుగులు పయనమయ్యాయి.
నిన్న(గురువారం) సాయంత్రమే పార్వతీపురం జిల్లాకు తరలించేందుకు ముసలిమడుగు క్యాంపు నుంచి రెండు కుంకీ ఏనుగులను అటవీ శాఖ అధికారులు లారీల్లో ఎక్కించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఏనుగుల తరలింపును చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొనసాగుతున్న ఏనుగుల దాడులను నియంత్రించేందుకు గుచ్చిమి వద్ద ప్రత్యేక ఎలిఫెంట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ఎలిఫెంట్ క్యాంపు ఆగస్టు 12న ఏనుగుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది.
మన్యం ప్రజలకు రక్షణగా కుంకీ ఏనుగులు: చలపతిరావు
కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అటవీ శాఖ అధికారి చలపతిరావు తెలిపారు. పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కంట్రోల్ చేసే నేర్పు వీటికి ఉందన్నారు. పలు సందర్భాల్లో వీటి పని తీరుతో పంటలను కాపాడాయని చెప్పుకొచ్చారు. గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కర్ణాటక ప్రభుత్వంతో ఈ కుంకీ ఏనుగులపై ఒప్పందం చేసుకున్నారని అన్నారు. 16 నెలల అభిమన్యుని ఏపీకి కర్ణాటక ప్రభుత్వం కానుకగా ఇచ్చిందన్నారు. ఇప్పుడు జయంత్, అభిమన్యుల ద్వారా మన్యం ప్రాంతంలో కూడా ఏనుగుల గుంపును నిలువరిస్తామని తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలకు, పొలాలకు రక్షణగా కుంకీ ఏనుగులు నిలుస్తాయని చలపతిరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..
తమ్మినేని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
Read Latest AP News And Telugu News