Share News

మనది..వికాసం వైసీపీది..విధ్వంసం

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:11 AM

గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని......

మనది..వికాసం వైసీపీది..విధ్వంసం

నేను, పవన్‌ కల్యాణ్‌ చక్కగా ఉంటున్నాం. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఇదే మాదిరి ఉండాలి. బీజేపీని కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఎడం లేదు. మున్ముందు కూడా రాకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలి. నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. గత పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం. వాటి వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు సెటిల్మెంట్లకు మనం దూరంగా ఉందాం. ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు. ఇగోలకు పోవద్దు.

- సీఎం చంద్రబాబు

  • ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది: సీఎం

  • చేసిన అభివృద్ధిని.. తెచ్చిన మార్పును.. పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం!

  • ఫ్లెక్సీలు, ఫొటోలు, కుర్చీల దగ్గర గొడవలొద్దు

  • నాకు, పవన్‌ కల్యాణ్‌కు మధ్య మంచి అనుబంధం

  • క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలూ ఇలాగే ఉండాలి

  • కేంద్రంతో గ్యాప్‌ లేదు.. మున్ముందు కూడా రాకూడదు

  • సీనియార్టీ, సిన్సియార్టీ, సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌తో కమిటీ కూర్పు, సమర్థత చూసే లోకేశ్‌కు పదవి

  • టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో బాబు వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కిల్లింగ్‌ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి అంటే గిట్టదని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలే మన పంథా అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువస్తుంటే, వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారని విమర్శించారు. వారు అడ్డుపడుతున్నా మనపై విశ్వాసంతో పెట్టుబడులు రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్నాయన్నారు. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ‘‘ఓసీడీ అనేది ఓ వ్యాధి. గొడ్డలి పార్టీకి ఇప్పుడు ఆవ్యాధి సోకింది. క్రెడిట్‌ చోరీ డిజార్డరుతో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైంది. వీళ్లని ఇలాగే వదిలేస్తే విశాఖకు గూగుల్‌నే కాదు, దేశానికి స్వాతంత్య్రం కూడా తామే తెచ్చామని చెబుతారు. ఆపరేషన్‌ సిందూర్‌కు డ్రోన్లు తామే ఇచ్చామని ఆ పార్టీ చెప్పేలా ఉంది.’’ అని ఎద్దేవా చేశారు. ‘‘సొంత బాబాయిని హత్య చేసి నెపం మనపై నెట్టారు. వాళ్ల కార్యకర్తను కారుతో తొక్కించి ఆ పాపాన్ని మనపై మోపారు. నా జీవితంలో రాజకీయ నేతలతో పోరాడాను. తొలిసారిగా నేరస్థులతో పోరాడుతున్నాను. మనది అభివృద్ధి. వాళ్లది అవినీతి. మనది వికాసం. వాళ్లది విధ్వంసం. మనం రిలాక్స్‌ అయితే అబద్ధాలు ప్రపంచమంతా తిరుగుతాయి. అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి.’’ అని చంద్రబాబు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

3.jpg


అహం వద్దు.. బేషజాలకు పోవద్దు

‘‘తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పనిచేయడం టీడీపీ మూల సిద్ధాంతం. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నేతలు ఉండాలి. నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మనం సుపరిపాలనా యజ్ఞం చేస్తున్నాం. ఈ సమయంలో నేతలు సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది. ఎవరైనా అధికారం ఉందని ఇగోలకు పోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో సెక్యూరిటీ తనకు అప్పగించిన పని తాను చేస్తుంది. దానికి నేను ఇగోకు వెళితే ఎలా? కీలక పదవుల్లో ఉన్నవారు తప్పు చేస్తే మీడియాలో హెడ్డింగ్‌లు వస్తాయి. పార్టీ క్రమశిక్షణను కూడా కాపాడాలి. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు. మళ్లీ మళ్లీ ఎన్నిక కావాలి. అందరూ మనస్పర్థలు లేకుండా పనిచేయాలి. తాను లేకుండా ఎంపీ రాకూడదని ఎమ్మెల్యేలు అనడం సరికాదు. పార్టీ ఎవరికైతే టికెట్‌ ఇస్తుందో వారితోనే కార్యకర్తలు ఉంటారనేది ప్రతి నేత గుర్తుపెట్టుకోవాలి’’.

ప్రతి బూత్‌లో గతానికి మించి ఓట్లు రావాలి

‘‘స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో చేసిన అభివృద్ధి, పడిన కష్టాన్ని ప్రజలకు చెబుదాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వన్‌సైడ్‌గా ఉంటాయి. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. 2024లో వచ్చిన ఓట్లకంటే ఈసారి ప్రతి బూత్‌ పరిధిలో ఎక్కువ ఓట్లు రావాలి. అప్పుడే బాగా పనిచేసినట్టు! పార్టీ ప్రతిష్ఠ పెరిగేలా ప్రతిఒక్కరూ పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి. టీడీపీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.మళ్లీ వైకుంఠపాళి అయితే రాష్ట్రానికి నష్టం.’’


కార్యకర్తే అధినేత నినాదం కాదు.. విధానం

‘‘నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలను ఏర్పా టు చేస్తున్నాను. కానీ ఈ స్థాయి కసరత్తు ఎప్పుడూ చేయలేదు. ఎన్నో వడపోతలు, వ్యూహాలతో నూతన కమిటీలను ఏర్పాటు చేశాం. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మేలేస్తారు. ఎవ్వరికీ తలవంచరు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కార్యకర్తే అధినేత అనేది నినాదం కాదు... విధానంగా మార్చుకున్నాం. మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్‌ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగలిగిన ఏకైక పార్టీ మనది. ఈ కమిటీల్లోనూ మహిళలకు పెద్ద పీట వేశాం. మహిళా బిల్లుకు పార్లమెంటులో పూర్తిగా మద్దతిచ్చాం. పార్టీలోని చదువుకున్న మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. అదే సమయంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. రామ్మోహన్‌నాయుడు, శబరి, కిలారు రాజేశ్‌ వంటివారిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించుకున్నాం.’’

లోకేశ్‌ వల్లే రాష్ట్రానికి కంపెనీలు

‘‘పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లోకేశ్‌ చాలా కీలక పాత్ర పోషించారు. శిక్షణ తరగతులను నిర్వహించడంతోపాటు కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామనే హామీని నెరవేర్చేందుకు లోకేశ్‌ కృషి చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేశే. ఆయన సమర్థతను గుర్తించే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించాం. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనేది పదవి కాదు, అదొక అత్యున్నత బాధ్యత. టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పదవులను బాధ్యతతో నిర్వహించాలి. 2024కు ముందున్న పరిస్థితులు అందరికీ తెలుసు. కార్యకర్తలు పడ్డ కష్టాలు నాకు గుర్తున్నాయి. పనిచేసిన వారికే పదవులిస్తాం. అన్నీ తెలుసునని తప్పులు చేయవద్దు. నేర్చుకుందాం. రాష్ట్రానికి ఉపయోగపడదాం.’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం..

‘‘వెంటిలేటర్‌ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం సాయంతో గట్టెక్కిస్తున్నాం. వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. నిలిచిన కేంద్ర పథకాలను పునర్ధురించుకోగలిగాం. అప్పులను రీషెడ్యూల్‌ చేసుకున్నాం. సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చాం. సంక్షేమం అందిస్తున్నాం. ప్రజలకు వాట్సాప్‌ సేవలందిస్తున్నాం. నీటి భద్రత కోసం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందిస్తున్నాం. పోలవరం, అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నాం. కేంద్రం సహకారంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాట పట్టేలా చేయగలిగాం. రాష్ట్రానికి గత పాలనలో పోయిన బ్రాండ్‌ నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలిగాం. విధ్వంసమైన విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించాం. ప్రజలపై ట్రూ అప్‌ చార్జీల భారం పడకుండా మనమే భరిస్తున్నాం. పైగా, ట్రూ డౌన్‌ చార్జీల ద్వారా ప్రజలపై విద్యుత్తు భారం తగ్గిస్తున్నాం. విద్యుత్తు కొనుగోళ్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. గతేడాది 30 పైసలు తగ్గించాం. మరో 30పైసలు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాం. గూగుల్‌ క్లౌడ్‌ డేటా సెంటర్‌ సహా వివిధ ఐటీ సంస్థలను తీసుకువచ్చి విశాఖను టెక్‌ నగరంగా మారుస్తున్నాం. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా సమర్థ పాలనతో ఇన్ని పనులు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో జీతాలకు 45 శాతం ఖర్చు పెడుతుంటే మనం 99 శాతం జీతాలకే ఖర్చు చేస్తున్న పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదని ఇన్ని కార్యక్రమాలు నిరంతరాయంగా చేపడుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి. ఠంచనుగా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలోనే బెస్ట్‌ పాలసీలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం.’’

2.jpg1.jpg

Updated Date - Apr 30 , 2026 | 04:11 AM