Share News

Kakinada: ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరచిపోవద్దు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:11 PM

కాకినాడలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందన్నారు..

Kakinada: ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరచిపోవద్దు: సీఎం చంద్రబాబు
Kakinada Green Ammonia Plant

కాకినాడ జిల్లా, జనవరి 17: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా (Green Ammonia) పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఇంధన రంగంలో ఇదో చారిత్రక మైలురాయిగా నిలవనుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందని తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరచిపోవద్దని చెప్పారు. ఆనాడు నాగార్జున ఫెర్టిలైజర్స్ (NFCL) ఏర్పాటులో దివంగత ఎన్టీఆర్ ఎంతో చొరవ చూపారని.. గ్రీన్ అమ్మోనియా భవిష్యత్‌లో పెను మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు.


ఇక్కడి నుండి ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తద్వారా భారత్ ఒక గొప్ప ఇంధన ఎగుమతిదారుగా ఎదుగుతుందన్నారు. బొగ్గు వినియోగంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందుల వినియోగం బాగా తగ్గించాలని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నట్లు గుర్తు చేశారు. 2014లో తమ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్‌, గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికిందని.. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌లో 20 పోర్టులు వస్తున్నాయని చెప్పారు.


2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ.. మన రాష్ట్రానికి వరం వంటివని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని.. 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా తయారవుతుందని తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..

ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 06:47 PM