Share News

ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడేలా చూడాలి: చంద్రబాబు

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:13 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తును సీఎం చంద్రబాబు ముమ్మరం చేశారు. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, యోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడేలా చూడాలి: చంద్రబాబు
chandrababu meeting with ministers

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తును సీఎం చంద్రబాబు ముమ్మరం చేశారు. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ చేసిన అన్యాయాన్ని వివరించారు. ‘జయహో బీసీ! జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామన్నారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని కలిసి ప్రచారం చేయాలని సూచించారు.


రప్పారప్పా టీంలకు గట్టిగా బుద్ధి చెప్పాలి

డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలన్నారు. ‘‘2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలి. ఇది నేతల పనితీరుకు కొలమానం. 50 రోజులు ఎవ్వరికీ మినహాయింపు లేదు. గెలుపే ధ్యేయంగా పని చేయాలి. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాం. సరిగా పని చేయాలని అందరినీ కోరుతున్నా. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకం. ఈ ఎన్నికలతో గొడ్డలి పార్టీకి, అభివృద్ది నిరోధకులకు, రౌడీలకు, రప్పారప్పా టీంలకు గట్టి బుద్ధి చెప్పాలి. రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశాం. అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశాం. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని చంద్రబాబు సూచించారు. చెత్త పన్ను రద్దు చేశామని, చెత్తనూ తొలగించి చక్కటి రోడ్లు వేశామన్నారు. ఇరిగేషన్ కు పూర్వ వైభవం తెచ్చామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేశామని, వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేశామని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని, స్థానిక ఎన్నికలు జరగ్గకూడదని గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లిందని, ఏపీలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు గొడ్డలి పార్టీ అన్యాయం చేయాలని భావించిందన్నారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కోత పెట్టిందని విమర్శించారు.


కూటమి బలపడాలి..

కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కూటమి బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. వివిధ స్థాయిల్లోని సమన్వయ కమిటీలను యాక్టివ్ చేయాలని, పై స్థాయిలో ఎలాంటి సమన్వయం ఉందో.. క్షేత్ర స్థాయిలో అలాగే ఉండాలన్నారుు. గొడ్డలి పార్టీ ఇమేజ్ పడిపోయిందని, అందుకే ఫేక్ ప్రచారం ముమ్మరం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న జగన్.. తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వల్ల ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారస్తులు జైళ్లకు వెళ్లారని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

Updated Date - Oct 11 , 2026 | 04:49 PM