నడిరోడ్డుపై రక్తధార!
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:46 AM
ఒక చిన్న ప్రమాదం... మరో పెను ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్లు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం... ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అంతకుముందే ప్రమాదానికి గురైన కంటైనర్ లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి ఎక్కి ఆగిపోయింది. అదే లారీని హైవేపై దూసుకొస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఫలితం... హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి రక్తసిక్తమైంది.
కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
నిద్రలోనే ఆరుగురు మృత్యుఒడికి
మరో 14 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ నుంచి వస్తున్న ‘ఫ్రెష్ బస్’
అప్పటికే ప్రమాదానికి గురై డివైడర్‌పైకి ఎక్కి ఆగిన కంటైనర్ లారీ
పక్కకు తీయించని హైవే పెట్రోలింగ్ సిబ్బంది
చివరి క్షణంలో గుర్తించిన బస్సు డ్రైవర్..
కంటైనర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
బస్సులోకి దూసుకెళ్లి.. ప్రాణాలు తీసిన గడ్డర్లు
మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులే
ప్రధాని మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంల దిగ్భాంతి
సూర్యాపేట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సోదరులకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన అక్కచెల్లెళ్లు.. తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన కుమారుడిని చూసుకోవడానికి వెళ్తున్న ఓ తల్లి.. సోదరుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయల్దేరిన ఓ అన్న.. మరికాసేపట్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వీరంతా.. మృత్యు ఒడికి చేరుకున్నారు! మార్గమధ్యంలోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరలిరాని లోకాలకు తరలిపోయారు!! బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొనడంతో బస్సులోని ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు కాగా.. ఒక పురుషుడు ఉన్నారు. వారిలో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. మృతులంతా ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందినవారే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు వెళ్లేందుకు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. ప్రైవేటు ట్రావెల్(ఫ్రెష్) బస్సు (టీఎస్08యూఎల్ 5112) 44 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అది విద్యుత్తు వాహనం కావడంతో చార్జింగ్ పెట్టేందుకు సూర్యాపేట సమీపంలోని రాయినిగూడెం వద్ద బస్సును ఆపారు. దాదాపు గంటసేపు చార్జింగ్ పెట్టారు. అనంతరం బయలుదేరిన బస్సు.. కోదాడ పట్టణం దాటగానే ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై అప్పటికే ప్రమాదానికి గురై రోడ్డు మధ్యలో డివైడర్‌పైకి ఎక్కి ఉన్న కంటైనర్ లారీని వెనుకనుంచి ఢీకొట్టింది.

ఐరన్ గడ్డర్ల లోడ్‌తో వెళ్తున్న ఆ లారీని అంతకుముందే గుర్తు తెలియని ఒక భారీ వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఆ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదుగానీ.. ఆ లారీ ప్రమాదం ధాటికి రోడ్డు మధ్యలో డివైడర్‌పైకి ఎక్కేసింది. అయితే, ఆ లారీ ఎడమవైపు టైర్లు మాత్రం రహదారిపైనే ఉండిపోయాయి.ఆ ప్రమాదం జరిగిన వెంటనే.. లారీ డ్రైవర్ తన వాహనాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేయకుండా, అక్కణ్నుంచీ పారిపోయాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సైతం దాన్ని గమనించలేదు. హైవేపై... డివైడర్ పైన భారీ కంటైనర్ లారీ ఆగిపోయినట్లుగా తెలిసేలా ఎలాంటి సూచిక బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయలేదు. ఈ ఘటన జరిగిన దాదాపు అరగంట తర్వాత.. సూర్యాపేట నుంచి బయల్దేరిన ఫ్రెష్ బస్సు అక్కడికి చేరుకుంది. చివరి క్షణం వరకు డివైడర్‌పై నిలిచి ఉన్న భారీ లారీని బస్సు డ్రైవర్ గమనించలేదు. అది కనిపించగానే... బస్సును ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పాడు. కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. బస్సు కుడివైపు భాగం ఆ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. లారీలో ఉన్న ఇనప గడ్డర్లు కిటికీల గుండా బస్సులోపలికి చొచ్చుకుపోయాయి. అవి గట్టిగా తాకడంతో కొందరు నిద్రలోనే మృతి చెందారు! మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, ఎస్పీ కొత్తపల్లి నరసింహ, కోదాడ రూరల్ పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతికష్టం మీద బయటకుతీసి కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కొంతమందిని హైదరాబాద్‌కు, కొందరిని విజయవాడకు పంపించారు. ప్రమాదానికి గురైన, బస్సు, లారీలను రోడ్డు మధ్య నుంచి క్రేన్ సాయంతో పక్కకు తీయించారు. ప్రమాదానికి గురైన కంటైనర్ లారీని సంబంధిత అధికారులు రోడ్డు మధ్యలో నుంచి ముందే పక్కకు తీయించి ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారణమైన లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు.. క్షతగాత్రులు..
మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కానూరుకు చెందిన బొల్లిపంగు మేరీ జ్యోత్స్న (29), ఉగ్గుటూరు మండలం తెల్లప్రోలుకు చెందిన యాసారపు చిన్ని (32), విజయవాడ ఆటోనగర్‌కు చెందిన సూరారపు షకీనా (24), విజయవాడలోని జయప్రకాష్ నగర్ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన పిడికిటి లక్ష్మీ (30), విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కోడూరు భావనవర్ష (25), కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం పడమటలంకపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(31)గా గుర్తించారు. వీరిలో మేరీ జ్యోత్స్న, నాగేంద్రబాబు, పిడికిటి లక్ష్మి, సూరారపు షకీనా హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇక.. విజయవాడ, ఏలూరు ప్రాంతాలకు
చెందిన పి. భవాని, యశ్వంత్, రాథోడు విఠల్, జి. మనోహర్, బండి చందన, యస్. అనిల్‌కుమార్, గోపిశెట్టి దృవ, జెట్టి వంశీ, సుంకర విజయలక్ష్మీ, రమణమ్మ, సుధాకర్, నవీన్‌కుమార్, అవినాష్ గాయపడ్డారు.
భయంతో నిశ్చేష్టులై..
బస్సులో ఉన్నవారిలో చాలా మంది.. బుధవారం మిలాద్-ఉన్-నబీ పర్వదినం, శుక్రవారం రాఖీ పండుగ, శనివారం కొందరికి సెలవు, ఆ తర్వాత ఆదివారం రావడంతో హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు బయలుదేరారు. ప్రమాదం జరిగే సమయానికి వారంతా నిద్రమత్తులో ఉన్నారు. ప్రమాదం తాకిడి పెద్ద శబ్దం రావడంతో.. ఉలిక్కిపడి నిద్రలేచి చూసేసరికి బస్సులో పక్క సీట్లో కూర్చున్న వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయి రక్తపుమడుగులో ఉండగా.. మరికొందరికితీవ్ర గాయాలై ర క్తస్రావం జరుగుతూ కనిపించిడంతో నిశ్చేష్టులయ్యారు. బస్సులో సురక్షితంగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అంబులెన్స్‌కు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. యాక్సిడెంట్ జరగడానికి కొద్దిసేపటి ముందే.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం గమనించిన ఒక ప్రయాణికుడు అతణ్ని హెచ్చరించినట్టు సమాచారం.
బస్సు ప్రమాదంపై ప్రధాని, సీఎం విచారం
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి
రష్యా కంపెనీలకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్! ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే..