టీడీపీ శ్రేణుల్లో జోష్
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:31 AM
టీడీపీ శ్రేణులు జోష్‌లో కనిపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌లు మూడు రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనుండటమే అందుకు కారణం.
ఉమ్మడి జిల్లాలో ఇద్దరు అగ్ర నేతల పర్యటనకు సిద్ధమవుతున్న తమ్ముళ్లు
ఏర్పాట్లలో కూటమి నేతలు బిజీ
రేపు ప్రకాశంకు రానున్న యువనేత నారా లోకేష్
పర్యటన సక్సెస్ కోసం ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్ కసరత్తు
ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం
31న వెలిగొండను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
భారీ ఏర్పాట్లలో నాయకులు, అధికారులు
మార్కాపురం జిల్లా అంతటా ముందస్తు సంబరాలు
టీడీపీ శ్రేణులు జోష్‌లో కనిపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌లు మూడు రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనుండటమే అందుకు కారణం. వారి పర్యటనల విజయవంతంపై కీలక ప్రజాప్రతినిధులతోపాటు వివిధ స్థాయిల్లోని నాయకులు దృష్టి సారించారు. ఆ మేరకు కేడర్‌లోనూ కదలిక కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి సీఎం వస్తున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఒంగోలు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : సాధా రణంగా ఏ పార్టీ నాయకులు అయినా, ప్రభు త్వ కీలక పదవుల్లో ఉన్న వారైనా.. పర్యటనకు వచ్చాక ఆ సందర్భంగా వారి ప్రసంగాలు, ప్రజలకు ఉపకరించే హామీలు వంటి వాటితో హుషారు వస్తుంది. అయితే ఈసారి టీడీపీ శ్రేణుల్లో ఇరువురు అగ్రనేతల పర్యటన ఖరారు నుంచే జోష్ కనిపిస్తోంది. లోకేష్ యువగళం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా సాగగా అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తర్వాత లోకేష్ జిల్లాలో అధికారిక పర్యటనకు రాలేదు. అంతేకాక ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. అలా టీడీపీ భవిష్యత్ సారథి గా పార్టీ శ్రేణుల్లోకి వస్తున్నారు. పలు అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపునకు ఉపక రించే కార్యక్రమాల్లో ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేసి ఈనెల 31న జాతికి అంకితం చేసేందుకు సీఎం వస్తున్నారు. అలా అగ్రనేతల పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో తదనుగు ణంగా వారి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం కదిలింది. యువనేత లోకేష్ పర్యటనపై ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్ విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఐదారు రోజుల నుంచి వారు పూర్తిగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈనెల 28న ఉదయం జిల్లాకు వచ్చే లోకేష్ తొలుత ఎస్‌ఎన్‌పాడు, అనంతరం ఒంగోలు నియోజకవర్గంలో పర్యటిస్తారు. లోకేష్ షెడ్యూల్ గతంలోనే ఖరారు కాగా స్వల్ప మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆయన పాల్గొనే రెండు ప్రధాన కార్యక్రమాలపై స్పష్టత ఉంది. 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ పరిధిలోని చదలవాడ సమీపంలో రవిప్రియ రాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఒంగోలులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు హాజరవుతారు. చివరగా ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ రెండు ప్రధానమైనవి కాగా మధ్యలో ఒంగోలులో పలు కార్యక్రమాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎమ్మెల్యేల విస్తృత కసరత్తు
లోకేష్ కార్యక్రమాలపై స్పష్టత రావడంతో తదనుగుణంగా ఏర్పాట్లలో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్‌లు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఒక దరిన లోకేష్ కార్యక్రమం జరగనుండగా నియోజకవర్గంలోకి ఆయన అడుగు పెట్టినప్పుటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు వేలాది మంది పార్టీ శ్రేణులు ఆయనను అనుసరించేలా ఎమ్మెల్యే బీఎన్ దృష్టి సారించారు. చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడుతోపాటు మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్యనేతలతో బుధవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి మండలాలు, గ్రామాల వారీగా జనసమీకరణ, వాహనాల ఏర్పాటు అంశాలపై సమీక్షించారు.
ర్యాలీలతో హోరెత్తేలా కార్యక్రమాలు
ఒంగోలులో లోకేష్ పర్యటనను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవైపు అధికారిక కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత శాఖలు ప్రత్యేకించి మునిసిపల్ అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు ఆయా పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు పార్టీశ్రేణులను భారీగా కదిలించేలా చర్యలు చేపట్టారు. నగరంలో లోకేష్ పర్యటన ఆద్యంతం ర్యాలీలు, కార్యకర్తల హడావుడితో హోరెత్తేలా దృష్టిపెట్టిన ఆయన బుధవారం నియోజకవర్గ పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం పర్యటనతో ఉత్సాహం
వెలిగొండను జాతికి అంకితం చేసేందుకు ఈనెల 31న సీఎం చంద్రబాబునాయుడు రానుండటంతో మార్కాపురం జిల్లా ప్రజల్లో ప్రత్యేకించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన కోసం ఒకవైపు అధికారులు పరుగులు పెడుతుండగా మరోవైపు ఆ ప్రాంత నేతలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు సీఎం కార్యక్రమం దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద జరగనుండగా వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఏర్పాట్లపై అధికారులను, జిల్లా, పొరుగు ప్రాంత నేతలను సమన్వయం చేసుకుంటూ మరోవైపు సీఎం సభకు భారీ జన సమీకరణలో నిమగ్నమయ్యారు.
------------------------------------