Share News

పొలాల్లో యంత్రాల బీభత్సం

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:24 AM

మండలంలోని శానంపూడి పంచాయతీ పరిధిలో ఉన్న పచ్చటి మామిడి తోటల్లో యంత్రాల బీభత్సం కొనసాగుతోంది. మట్టి మాఫియా ఏమాత్రం బెరుకు లేకుండా అసైన్డ్‌ భూముల నుంచి నిత్యం టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్‌ను తరలిస్తోంది.

పొలాల్లో యంత్రాల బీభత్సం
టిప్పర్‌కు మట్టిని లోడ్‌ చేస్తున్న భారీ ఎక్స్‌కవేటర్‌

శానంపూడిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

తాజాగా కందుకూరు ప్రాంత కాంట్రాక్టర్‌ పాగా

శానంపూడి- ఓగూరు సరిహద్దులోని

అసైన్డ్‌ భూముల్లో రాత్రింబవళ్లూ తవ్వకాలు

ఉలవపాడులోని వెంచర్‌కు టిప్పర్లలో తరలింపు

చోద్యంచూస్తున్న అధికారులు

సింగరాయకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని శానంపూడి పంచాయతీ పరిధిలో ఉన్న పచ్చటి మామిడి తోటల్లో యంత్రాల బీభత్సం కొనసాగుతోంది. మట్టి మాఫియా ఏమాత్రం బెరుకు లేకుండా అసైన్డ్‌ భూముల నుంచి నిత్యం టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్‌ను తరలిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు సాగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలతో భూముల్ని తవ్వేస్తుండటంతో ఈ ప్రాంత స్వరూపమే మారిపోతుందని చెబుతున్నారు. తవ్వకాలు భవిష్యత్‌లో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వాపోతున్నారు.

పట్టపగలే తరలిస్తున్న కందుకూరు కాంట్రాక్టర్‌

కందుకూరు నియోజవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ మూడు రోజుల క్రితం శానంపూడి- ఓగూరు సరిహద్దుల్లో ఉండే అసైన్డ్‌ భూముల్లోకి భారీ ఎక్స్‌కవేటర్లను దింపారు. వాటితో మట్టిని తవ్వి టిప్పర్లతో ఉలవపాడు జాతీయ రహదారి పక్కనే 90 ఎకరాల్లో వేసిన వెంచర్‌కి తరలిస్తున్నారు. రాత్రింబవళ్లు దాదాపు 20 భారీ టిప్పర్లు గ్రావెల్‌ను అక్రమ రవాణా చేస్తూ జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకెళ్తున్నాయి. పట్టపగలు కళ్లేదుటే జరుగుతున్న అక్రమ తంతును చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శానంపూడిలోని సర్వే నెం.519-1లో ఉలవపాడు గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చెందిన దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. అందులో నాణ్యమైన గ్రావెల్‌ లభ్యమవుతోంది. ఆ భూమి పక్కనే 519-2లో అరకొర అనుమతులతో గులకరాళ్లు వ్యాపారం చేస్తున్న వ్యక్తి అక్రమంగా రాత్రి సమయాల్లో దేవుడి భూమిలో మట్టి తవ్వి తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న మామిడి తోటలను కొనుగోలు చేసి ఎటువంటి అనుమతులు లేకుండా ఆ భూముల్లో నిరంతరం మట్టి తవ్వకాలు చేస్తున్నారు. పచ్చని మామిడి తోటల మధ్యలో యంత్రాలతో మట్టిని జల్లెడపట్టి, అందులోని రాళ్లను గ్రేడ్‌ చేస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని తోటలు ఎర్రటి మట్టి దూళితో నిండిపోతున్నాయి. దీంతో కాపు సక్రమంగా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధలను విరుద్ధంగా నడుపుతున్న ప్లాంట్‌ను వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అనుమతులు ఉన్నాయా..

శానంపూడి పరిధిలో మట్టిని తరలించే వ్యక్తులు కొంతమంది తమకు అనుమతులు ఉన్నాయని మభ్యపెడుతూ రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గనుల శాఖ నుంచి మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి.. ఉంటే అనుమతించిన విస్తీర్ణం ఎంత.. వాస్తవంగా ఎంతమేర తవ్వకాలు జరిగాయి. తవ్విన గ్రావెల్‌కు రాయల్టీ, డీఎంఎప్‌ తదితర ప్రభుత్వ బకాయిలు చెల్లించారా లేదా అనే అంశాలను గనులశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చాలి. పట్టపగలే హైవేపై గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత గనులు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే వారు స్పందించి అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 03:24 AM