Share News

22 నాటికి ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం!

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:22 AM

ఆంధ్రప్రదేశ్‌లో 41 పట్టణ స్థానిక సంస్థలకు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేసింది.

22 నాటికి ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం!
AP voter list 2026

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 22న ఆయా జాబితాలను ప్రచురించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లలో డీలిమిటేషన్‌ పూర్తయిన విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ ఈ నెల 3నే పూర్తయింది.


మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్లలో డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తికి మరింత గడువు ఇవ్వాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో ఆయా కార్పొరేషన్లకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 22న జాబితాలు ప్రచురించనున్నట్టు పేర్కొంది. అలాగే 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకూ 22నే జాబితాలను ప్రచురించనున్నారు. ఆయా సంస్థల్లో చైర్‌పర్సన్‌ పదవులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని పేర్కొంది.


సర్‌’ గడువు పొడిగించాలి: ఓటు పరిరక్షణ వేదిక

రాష్ట్రంలో ఓటర్ల ఓటుహక్కుకు ముప్పు రాకుండా చూడాలని ఓటు పరిరక్షణ వేదిక డిమాండ్‌ చేసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కోరింది. ఓట్లు తొలగించిన, నోటీసులు జారీ చేసిన వారి జాబితాలను బహిరంగపరచాలని.. పోలింగ్‌ బూత్‌ల వారీగా జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి విజ్ఞప్తి చేసింది.


వేదిక ఆధ్వర్యంలో 15 మందితో కూడిన బృందం మంగళవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ను కలిసి 13 డిమాండ్లతో వినతి పత్రం అందజేసింది. ఈ బృందంలో వేదిక కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, కాంగ్రెస్‌నేత శివాజీ, వైసీపీ నేత మల్లాది విష్ణు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెడ్‌ కానిస్టేబుల్‌ సాహసం
వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!..100 రోజులైనా దొరకని ఆచూకీ
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:22 AM