ఫ్రీహోల్డ్‌కు విముక్తి
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:17 AM
ఏపీలో 9,08,472 ఎకరాల అసైన్డ్, చుక్కల, షరతుగల పట్టా, గ్రామ సర్వీసు ఇనాం భూములకు ఫ్రీహోల్డ్ హోదా కల్పించి రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా 3,91,664 ఎకరాలు నిషేధంలో ఉండగా, ఫ్రీహోల్డ్‌పై ఆర్‌డీవో/సబ్‌కలెక్టర్ ఆదేశాలపై 60 రోజుల్లో జేసీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
9,08,472 ఎకరాల అసైన్డ్ భూములకు స్వేచ్ఛ
చుక్కల భూమి, గ్రామ సర్వీసు ఇనాం,
షరతుగల పట్టా భూములకు కూడా..
వాటిపై ఇక రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు
3,91,664 ఎకరాలు ఇంకా నిషేధంలోనే
పరిశీలన తర్వాత వాటిపైనా నిర్ణయం
ఫ్రీహోల్డ్‌పై ఆర్‌డీవో/సబ్‌కలెక్టర్ ఆదేశాలు
నచ్చకుంటే 60 రోజుల్లో జేసీకి అప్పీల్
జేసీ ఆర్డర్ నచ్చకపోతే 90 రోజుల్లో
రివిజన్ అథారిటీకి వెళ్లాలి.. జీవో జారీ
సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. జగన్ హయాంలో ఇష్టానుసారం నిషేధ భూముల జాబితా(22ఏ)లో చేర్చిన భూముల ఫ్రీహోల్డ్‌కు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతుగలపట్టా భూములు, ఇంకా గ్రామ సర్వీసు ఇనాం భూములకు నిషేధ విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం-1977(2023 చట్టసవరణ), దాని అమలు కోసం జారీచేసిన జీవో 596 మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రంలో 9,08,472 ఎకరాలను ఫ్రీహోల్డ్ పరిధిలోకి తీసుకొస్తూ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం కూడా తొలగిపోయింది.
బుధవారం నుంచే ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం కల్పిస్తూ రెవెన్యూశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు(జీవో 588) జారీ చేశారు. ఫ్రీహోల్డ్ పరిధిలోకి వచ్చిన భూములపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. వాటికి ఫ్రీహోల్డ్ హోదా రాగానే పట్టా భూములుగా పేర్కొంటూ రైతులు, హక్కుదారుల పేరిట నమోదుచే యాల్సి ఉంటుంది. అయితే, ఇంకా 3.91 లక్షల ఎకరాలు నిషేధంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ చట్టం-1977, జీవో 596కు విరుద్దంగా ఆ భూములను 2024లో ఫ్రీహోల్డ్ చేశారు. వాటిపై ప్రభుత్వ పరిశీలన కొనసాగుతోంది. ఇందులో 28,282 ఎకరాలకు ఇంకా 20 ఏళ్ల కాలపరిమితి రాలేదు. కాబట్టి ఆ పరిమితి వచ్చేవరకు ఆ భూములు చట్టం పరిధిలోనే ఉంటాయి.
వాటిలో 7.85 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములే..
తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం 9,08,472 ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్ చేసింది. ఇందులో అసైన్డ్ భూములే 7,85,500 ఎకరాలున్నాయి. వీటిపై ఎలాంటి వివాదం లేకపోవడంతో ఫ్రీహోల్డ్ పరిధిలోకి తెచ్చారు.
అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా 5,422 ఎకరాల పట్టా భూములను అసైన్డ్‌గా రికార్డుల్లో నమోదుచేశారు. వీటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేశారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో వీటిని పట్టా భూములగా నమోదు చేయాలి.
ఫ్రీహోల్డ్‌కు అర్హత ఉండి.. ఎలాంటి ఆదేశాలూ లేకున్నా నిషేధ జాబితా నుంచి 64,143 ఎకరాలను బయటకు తీశారు. వీటికి ఇప్పుడు ఎలాంటి ఫ్రీహోల్డ్ ఆదేశాలూ అక్కర్లేదు. 20 ఏళ్ల కాలపరిమితి దాటిన జాబితాలో ఈ భూములున్నందున అవి కూడా ఫ్రీహోల్డ్ అయినట్లుగానే భావించాలి.
ఇటు అసైన్ట్ భూముల చట్టం-1977, అటు చుక్కల భూముల చట్టం-2017 పరిధిలోకి వచ్చే 17,897 ఎకరాలు కూడా జీవో 596 ప్రకారం ఫ్రీహోల్డ్ పరిధిలోకి వచ్చాయి. వీటినీ నిషేధ జాబితా నుంచి తొలగించి రైతుల పేరిట రికార్డులు మార్చాలి.
అసైన్‌మెంట్ భూముల్లో ఎక్కువ విస్తీర్ణం కలిపి ఫ్రీహోల్డ్ చేసినవి 11,749 ఎకరాలున్నాయి. వీటిని రీసర్వే రికార్డుల ఆధారంగా సరిచేయాలి. సంబంధిత సర్వే నంబర్లలోని భూవిస్తీర్ణం ఆధారంగానే ఫ్రీహోల్డ్ చేయాలి.
నీటి వనరులతో సంబంధం లేని 24,261 ఎకరాల పోరంబోకు భూములూ ఫ్రీహోల్డ్ అయినట్లే.
1,36,024 ఎకరాల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఇంతకుముందే వివిధ ఉత్తర్వుల ద్వారా ఫ్రీహోల్డ్ చేశారు. వాటి అమలుకు చర్యలు తీసుకోవాలి.
నిషేధంలో ఉండే భూములివీ..
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో 38,733 ఎకరాలపై నిషేధం కొనసాగుతుంది.
అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ అయినా, సంబంధిత భూముల్లో చట్టబద్ధంగా అసైనీల పొజిషన్‌లో లేనివి 25,486 ఎకరాలున్నాయి. వాటిని ఫ్రీహోల్డ్ పరిధిలోకి తీసుకురాలేదు. కాబట్టి వాటిపై నిషేధం కొనసాగుతుంది.
వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో అసైన్డ్ భూములుగా చూపిస్తున్నా.. 2,87,153 ఎకరాలకు అందుకు ఆధారాల్లేవు. వాటిని ఫ్రీహోల్డ్ చేయలేదు. వాటిపై నిషేధం కొనసాగుతుంది. ఈ భూములపై ఏం చేయాలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.
నీటి వనరులున్న భూములు 3,517 ఎకరాలను లోగడ ఫ్రీహోల్డ్ చేశారు. ఇప్పుడు వాటి ఫ్రీహోల్డ్ చెల్లదు. వాటిపై నిషేధం కొనసాగుతుంది.
చట్టం ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి పరిధిలోకి రాని 28,292 ఎకరాలపై నిషేధం ఉంటుంది. వాటి కాలపరిమితి దాటాక ఫ్రీహోల్డ్ అవుతాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ అయి వెంటనే రిజిస్ట్రేషనైన భూములు 8,483 ఎకరాలున్నాయి. వాటిపై నిషేధం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.
సీలింగ్ భూమిగా గుర్తించి ఇతరులకు అసైన్ చేసినవి కూడా ఫ్రీహోల్డ్ పరిధిలోకి వస్తాయి.
జేసీకి అప్పీలు చేసుకోవాలి..
ఫ్రీహోల్డ్ భూములపై ఆర్‌డీవో లేదా సబ్‌కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు రైతులకు, హక్కుదారులకు నచ్చని పక్షంలో వాటిపై జాయింట్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవాలి. ఆర్‌డీవో ఆర్డర్ ఇచ్చిన 60 రోజుల్లో జేసీకి అప్పీల్ చేయాలి. జేసీ ఇచ్చిన ఆదేశం కూడా రైతుకు నచ్చని పక్షంలో 90 రోజుల్లోగా రివిజన్ అథారిటీగా ఉన్న రెవెన్యూ శాఖకు అప్పీల్ చేసుకోవాలి.
ముందస్తు పరిష్కారాలు..
ఫ్రీహోల్డ్ భూముల విషయంలో చిన్న చిన్న సాంకేతిక కారణాలతో రైతులకు రెవెన్యూ చిక్కులు రాకుండా ముందస్తు పరిష్కారాలు ఏమిటో కూడా రెవెన్యూ శాఖ స్పష్టత ఇచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో అసైన్డ్ భూమి ఉండి, అందులో రైతు పేరు లేకుంటే.. తన పేరు నమోదు చేయాలని సదరు రైతు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రైతు ఇచ్చిన సమాచారాన్ని, రెవెన్యూ రికార్డులను పరిశీలించి.. అన్నీ సరిపోలితే రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత తహశీల్దార్‌దేనని స్పష్టం చేసింది.
రీసర్వే సందర్భంగా.. అసైన్డ్ భూముల రికార్డులను తారుమారుచేసి, రైతుల పేర్లు తీసేసి వాటిని ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తున్నట్లుగా తహశీల్దార్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే రికార్డులు మార్చిన అసైన్డ్ భూముల విషయంలో వెంటనే రైతుల పేర్లు నమోదు చేయాలని.. ఇకపై అసైన్డ్ భూములను ప్రభుత్వ భూమిగా నమోదు చేయవద్దని సర్కారు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది.
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్, వాటి రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పుడా నిషేధాన్ని ఎత్తివేయడంతో.. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేపట్టాలి.
వచ్చే నాలుగు వారాల్లోగా సీసీఎల్‌ఏ ఎలకా్ట్రనిక్ రెవెన్యూ డేటా రికార్డ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఫ్రీహోల్డ్ భూముల డేటా రికార్డుల్లో కనిపించేలా చేయాలి. ఫ్రీహోల్డ్ అయినవి, ఫ్రీహోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లు వెబ్‌ల్యాండ్‌లో కనిపించేలా చర్యలు చేపట్టాలి. దానికి తగ్గట్లు రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్‌వేర్ మార్చాలి.
నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ జాబితాలోకి వచ్చిన భూములను కొందరు తహశీల్దార్లు కావాలని తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సీసీఎల్‌ఏ జోక్యం చేసుకుని, అర్హత కలిగిన ఫ్రీహోల్డ్ భూములన్నీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలి.
ఫ్రీహోల్డ్ ఎలా?
ఏపీ అసైన్‌మెంట్ భూముల చట్టం ప్రకారం.. భూమి అసైన్‌మెంట్ అయి 20 ఏళ్ల కాలపరిమితి దాటితే.. జీవోలు 596, 588 ప్రకారం అర్హత గల రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి ఫ్రీహోల్డ్ హక్కు పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు నేరుగా సంబంధిత ఆర్‌డీవో లేదా సబ్‌కలెక్టర్ పరిశీలనకు వెళ్తుంది. వారు రికార్డులను పరిశీలించి ఫ్రీహోల్డ్ హక్కు పత్రాలను జారీ చేస్తారు. అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ హక్కులు ఇచ్చే అధికారం జీవో 596 ప్రకారం కలెక్టర్, జేసీలకు ఉండేది. ఇప్పుడా ఉత్తర్వును సవరించి ఆ అధికారం ఆర్‌డీవో లేదా సబ్‌కలెక్టర్‌కే ఉంటుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఇదీ నేపథ్యం..
జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం-1977ను సవరించిన సంగతి తెలిసిందే. భూముల అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్ల కాలపరిమితి దాటితే వాటిపై అసైనీ( హక్కుదారు)కే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫ్రీహోల్డ్ చేయడం ఈ చట్టసవరణ ఉద్దేశం. అసైన్డ్ చట్టం ప్రకారం నిషేధ జాబితాలో ఉండే భూమి 20 ఏళ్ల కాలపరిమితి దాటాక నిషేధ విముక్తి పొందుతుంది. ఆ తర్వాత అసైనీ పేరిట పూర్తి హక్కులు వస్తాయి. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని పట్టాగానే నమోదుచేస్తారు. ఫ్రీహోల్డ్ అయిన తర్వాత ఆ భూమిని తన వ్యక్తిగత అవసరాలకు ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఇతరులు ఆ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విధానం అమలుకు 2023 డిసెంబరు 19న ప్రభుత్వం జీవో 596 జారీ చేసింది.
నాడు అంతులేని అక్రమాలు..
20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేస్తారన్న ముందస్తు సమాచారంతో వైసీపీ నేతలు అక్రమాలకు తెరతీశారు. నాటి రెవె న్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్న సమయంలోనే వైసీపీ నేతలు భారీఎత్తున అసైన్డ్ భూములను దక్కించుకున్నారు. ఉపసంఘం సిఫారసుల తర్వాత 2023లో జగన్ ప్రభుత్వం ఏపీ అసైన్డ్ భూముల చట్టం-1977లో సవరణ చేసింది. 2024 మేలో ఎన్నికలకు ఆరు నెలల వ్యవధిలో 13.75 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వాన విచారణ కమిటీలు ఏర్పాటుచేసి అధ్యయనం చేయించింది. విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
13.75 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేస్తే.. అందులో 5.85 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా 22ఏ నుంచి తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 2024 ఆగస్టు 10న ఫ్రీహోల్డ్ భూములపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అవి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగాయి. ఫ్రీహోల్డ్ భూములకు విముక్తి కల్పించే విషయంలో 2025లోనే ప్రభుత్వం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం గత ఏడాది డిసెంబరులో నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఫ్రీహోల్డ్ పరిధిలోకి వచ్చే భూములకు దశల వారీగా విముక్తి కలిగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News