ఉద్యాన హబ్‌కు ప్రపంచబ్యాంకు ఓకే!
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:00 AM
రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేసే రూ.లక్ష కోట్ల సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికకు ప్రపంచబ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
ఆర్థిక సాయానికి సూత్రప్రాయంగా అంగీకారం
ఆర్థిక, జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో కీలక భేటీ
ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీ ఏర్పాటు చేయండి
‘హబ్’ బాధ్యత ఎవరిదో స్పష్టం చేయండి
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువుపీడి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యానవన హబ్‌గా ఏర్పాటుచేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఉద్యావన పంటల ఉత్పత్తులకు విలువను జోడించి.. రైతాంగానికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు సీఎం చంద్రబాబు ‘సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళిక, దానికి ఆర్థిక సాయంపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం రాష్ట్ర ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైంది.
ఢిల్లీలోని ప్రపంచబ్యాంకు కార్యాలయంలో సీనియర్ వ్యవసాయ స్పెషలి్‌స్టగా ఉన్న రంజన్ సామంతరాయ్ ఈ బృందానికి నేతృత్వం వహించగా.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్, వ్యవసాయం, జలవనరుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బుడితి రాజశేఖర్, శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ బాలూనాయక్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన రాయలసీమ ఉద్యానవన హబ్ పథకానికి వరల్డ్ బ్యాంకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపింది. అయితే.. ఆర్థిక, ఉద్యానవనం, వ్యవసాయం, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని చేపడుతున్నందున దీని బాధ్యతను ఎవరు తీసుకుంటారో స్పష్టం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.
ముందుగా ప్రాజెక్టు మానిటరింగ్ ఏజెన్సీ(పీఎంఏ)ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని.. ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నందున.. ఉద్యానవన శాఖ నేతృత్వంలోనే దీనిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదేవిధంగా ఉద్యాన, జల వనరులు, పంచాయతీరాజ్ శాఖలు ‘లైన్ డిపార్ట్‌మెంట్లు’గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపింది. పీఎంఏ ఏర్పాటయ్యాక ఉద్యానవన హబ్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో నివేదిక పంపాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ రిపోర్టు అందాక.. తాము స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించి.. ఆమోదం తెలుపుతామని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.
సంయుక్త కార్యాచరణ..
యూపీ, మహారాష్ట్ర తరహాలో పండ్లతోటలకు ప్రత్యేకంగా విలువను జోడించడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికీ సంపదను సృష్టించవచ్చన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా.. జల వనరులు, వ్యవసాయం, హార్టీకల్చర్, పంచాయతీరాజ్ (గ్రామీణ రోడ్లు) శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేశాయి. రూ.లక్ష కోట్ల వ్యయంతో సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ) అమలుకు ఈ ఏడాది మే 19వ తేదీన ప్రభుత్వం జీవో 416 జారీ చేసింది. ఈ ఉత్తర్వు మేరకు ఈ శాఖలన్నీ కలిసి ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)గా సమగ్ర కార్యాచరణ రూపొందించాయి. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.60,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు రుణం కింద రూ.40,352 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం.
రానున్న మూడేళ్లలో 291 హర్టీకల్చర్ క్లస్టర్లను ప్రతిపాదించారు. ఐహెచ్‌డీపీతో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కడప, కర్నూలు మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి.. మొత్తం 10 జిల్లాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ జిల్లాల్లో రూ.20,884 కోట్లతో 32 మేజర్ ప్రాజెక్టులు, 1011 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 21 చెక్‌డ్యాములను అభివృద్ధి చేస్తారు. ఇవి పూర్తయితే దాదాపు 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వొచ్చు. 4.3 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పరిధిలో వెలిగొండ తొలిదశ (ఇప్పటికే పూర్తయింది), రెండోదఽశ (2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం), కొరశపాడు ఎత్తిపోతల, పాలార్ రిజర్వాయరు, మల్లెమడుగు ఎత్తిపోతల/రిజర్వాయరు, బాలాజీ రిజర్వాయరు, కుప్పం యామిగానిపల్లి రిజార్వయరు, కుప్పం బ్రాంచ్ కెనాల్, కల్యాణి డ్యాం, హంద్రీ-నీవా రెండో దశ కాలువల నిర్మాణం, అల్లూరుపాడు ఎత్తిపోతల/రిజర్వాయరు, అప్పర్ పెన్నా, భైరవానితిప్ప, కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ మొదలైనవి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రానికి మజగావ్ డాక్!
మీ రాష్ట్రంతో మాకు చేదు అనుభవం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News