Share News

ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:34 AM

‘ప్రతి వ్యవస్థ కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి. ఈ విషయంలో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం.

ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

  • ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

  • చంద్రబాబుకు యంగ్‌ హార్డ్‌వేర్‌ టీమ్‌ అండగా ఉంది

  • కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకొనేలా పాలసీలు

  • పారిశ్రామికవేత్తలను జాతి నిర్మాణ కర్తలుగా భావిస్తున్నాం

  • ఎంవోయూలు కుదుర్చుకుని, మర్చిపోయేవాళ్లం కాదు

  • స్పీడ్‌, సర్వీస్‌, స్టెబిలిటీ అనే మూడు ‘ఎస్‌’లతోనే అభివృద్ధి

  • పాన్‌ ఐఐటీ సమ్మిట్‌-2026లో మంత్రి లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ‘ప్రతి వ్యవస్థ కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి. ఈ విషయంలో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని లోకేశ్‌ అన్నారు. శనివారం విజయవాడ అంబేడ్కర్‌ కళావేదికలో నిర్వహించిన పాన్‌ ఐఐటీ సమ్మిట్‌- 2026లో ఆయన ప్రసంగించారు. ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ‘గత రెండేళ్లలో ఏపీ ప్రయాణాన్ని చూస్తే, మొదట వేగాన్ని మంత్రంగా తీసుకున్నాం. తర్వాత జుగాడ్‌ మోడల్‌కు వెళ్లాం. ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నాం. జుగాడ్‌ నుంచి ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ స్పీడ్‌ వైపు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. భారతదేశాన్ని గర్వపడేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మనం చేసే ప్రతి మంచి పని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని లోకేశ్‌ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఆయనకు యంగ్‌ హార్డ్‌వేర్‌ టీమ్‌ అండగా ఉంది. 50 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచినవారే. 25మందిలో 17 మంది తొలిసారి మంత్రులైనవారు ఉన్నారు. ఏ రంగంలోనైనా ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


భారత్‌ అభివృద్ధికి దశాబ్దం చాలు

‘అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరప్‌ దేశాలకు దాదాపు వందేళ్లు పట్టింది. దుబాయ్‌ 30 ఏళ్లలో, సింగపూర్‌ 25 ఏళ్లలో ఆ స్థాయికి చేరుకున్నాయి. భారత్‌ అభివృద్ధి సాధించడానికి ఒక దశాబ్దం సరిపోతుంది. ఆ గోల్డెన్‌ డికేడ్‌ మనదే కావాలి. దీనికి స్పీడ్‌, సర్వీస్‌, స్టెబిలిటీ అనే మూడు ‘ఎస్‌’లతో కూడిన మంత్రమే ఆధారం. ఎంవోయులు కుదుర్చుకుని, మర్చిపోయే పని మాది కాదు. ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి, వాటి ద్వారా ఉద్యోగాలు సృష్టించాలన్న తపన మాది. వ్యవస్థాపకులు, పరిశ్రమలను జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నాం. మీతో కలిసి పనిచేయాలి, పాలసీలు రూపొందించాలి. ప్రపంచ స్థాయి పాలన అందించాలి. ఆ పాలసీలు కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి.’


ఎంవోయూలపై కాదు... అమలుపైనే దృష్టి

‘మా ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని ప్రపంచ హార్టికల్చర్‌ హబ్‌గా మార్చాలనే విజన్‌ ఉంది. ఆయన ముఖేశ్‌ అంబానీని ఒప్పించి రాయలసీమలోని మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేయించారు. శుక్రవారం దానికి శంకుస్థాపన చేశాం. ఇది హార్టికల్చర్‌ ఎకోసిస్టమ్‌లో దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సాధిస్తుంది. గతంలో మనకు రెండు స్టీల్‌ప్లాంట్లు మాత్రమే ఉండేవి. ఇటీవల ఆర్సెలార్‌ మిట్టల్‌ 17 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్ట్‌ స్టీల్‌ ప్లాంట్‌కు పునాది వేశాం. ఇతర రాష్ట్రాల్లో దాదాపు దశాబ్దం పాటు నిలిచిపోయిన ప్రాజెక్టును కేవలం 17 నెలల్లో పట్టాలెక్కించడం మా వేగానికి నిదర్శనం. అదేవిధంగా 13 నెలల్లోనే గూగుల్‌ ప్రాజెక్టుకు ఏపీలో పునాది పడింది. ఇక్కడ డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రభుత్వం ఉన్నందుకే పనులు వేగంగా జరుగుతున్నాయి. విభాగాల వారీగా 23 క్లస్టర్లను నిర్మించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. వీటికోసం మీ లోతైన, అర్థవంతమైన పరిజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించండి. అమరావతిని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను చూడండి. మీకు నిర్మాణంలో ఉన్న ఒక ఆధునిక నగరం కనిపిస్తుంది. భారతదేశం ఇంతకు ముందు చూడని ఒక నగరాన్ని నిర్మిస్తున్నాం.’

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:34 AM