ప్రాణనష్టం జరగకుండా చూడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:58 AM
మురసు తుఫాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తుఫాన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: మురసు తుఫాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తుఫాన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. మురసు తుఫాన్ అర్ధరాత్రి ఒంటి గంటకు తీరాన్ని తాకిందని, ఉదయం 6:30 గంటలకు తీరాన్ని దాటుతుందని అధికారులు ఆయనకు చెప్పారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని మురసు తుఫాన్ తాకిందని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనం రోడ్లపైకి రాకుండా చూడాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేర నివారించాలన్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడా పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగలేదని అధికారులు వివరించారు.
బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రెండు చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని ఆయన చెప్పారు. నెల్లూరులో 7 చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఒంగోలు జిల్లాలో 5 ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయని, సమాచారం రాగానే సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక వంటి ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, ఎక్కడా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పిన కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. బుడమేరు పరిధిలో పర్యటించామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ వెల్లడించారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడతాయనే ముందు జాగ్రత్తలో భాగంగా కొన్ని కుటుంబాలను శిబిరాలకు తరలించామని లక్ష్మీషా పేర్కొన్నారు. కాగా.. గత రాత్రి 10:00 గంటలకు సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి సీఎం సమాచారం తీసుకుంటూనే ఉన్నారు. సోమవారమంతా ఆర్టీజీఎస్‌లోనే ఉండి తుఫాన్‌పై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి