త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:38 PM
ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి వచ్చిన బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తుఫాన్ వల్ల ఏపీకి ప్రాథమికంగా రూ.4,526 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ బృందం వెల్లడించింది.
అమరావతి, నవంబర్ 2: ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి వచ్చిన బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తుఫాన్ వల్ల ఏపీకి ప్రాథమికంగా రూ.4526 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ బృందం వెల్లడించింది. దీంతో కేంద్రం త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించాలని సీఎం కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుఫాను నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపించామని వెల్లడించారు. త్వరితగతిన రాష్ట్రానికి కలిగిన నష్టం అంచనా వేసిన కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఆర్నబ్ కారణంగా వ్యవసాయ పంటలు, కొబ్బరి, అరటి లాంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆర్నబ్ మిగిల్చిన నష్టాన్ని ఇంకా పూడ్చుకోకముందే మురసు తుఫాను రాష్ట్రాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఏపీలోని కొన్ని ప్రాంతాలు ఎల్‌నినో లాంటి తీవ్ర కరువును, మరికొన్ని ప్రాంతాలు తుఫాన్ల ముప్పును ఎదుర్కొంటున్నాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్నబ్ నష్టాన్ని సీఎం వివరిస్తూ.. ఈ తుఫాన్ ప్రభావం ఉద్యాన, ఆక్వాకల్చర్ లాంటి వాణిజ్య పంటలుపైనా పడిందని అన్నారు. ‘ఆర్నబ్ కారణంగా విద్యుత్, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలూ దెబ్బతిన్నాయి. మత్స్యకారుల పడవలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పాటు వివిధ టెక్నాలజీల అనుసంధానంతో ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించాం. పునరావాసం, సహాయక చర్యలను ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షించాం. విద్యుత్ పునరుద్ధరణకు 7 వేల మందితో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. కేంద్ర బృందం త్వరితగతిన సిఫార్సులు చేసి నష్టాన్ని భర్తీ చేసేలా సహకరించాలని కోరారు. కేంద్రం చేసే సత్వర సాయం రాష్ట్రానికి పెద్ద ఊరట ఇస్తుందని చెప్పారు.
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్డీఎంఏ