ఎన్నికల విధులకు వైసీపీ ఆటంకం
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:19 AM
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు, హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాని కలసి ఫిర్యాదు చేశారు.
జగన్, దేవినేని అవినాశ్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు, హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాని కలసి ఫిర్యాదు చేశారు. పులివెందులలో మాజీ సీఎం జగన్ వర్గీయులు సృష్టించిన విధ్వంసం, విజయవాడ లయోలా కాలేజీలోని 5వ నంబరు పోలింగ్ బూతులోకి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తన అనుచరులతో దౌర్జన్యంగా చొరబడి హల్‌చల్ చేసిన ఘటనలపై టీడీపీ తన ఫిర్యాదులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా వ్యవహరించిన జగన్, అవినాశ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్, టీడీపీ నేత గురజాల మాల్యాద్రి తదితరులు ఉన్నారు. అనంతరం వర్ల మీడియాతో మాట్లాడుతూ... ‘ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ నేత జగన్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరదీశారు. ఓటేసేందుకు బెంగళూరు నుంచి పులివెందులకు హెలికాప్టర్‌లో వచ్చిన జగన్ చివరికి ఓటేయకుండానే, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా గొడవ చేసి, ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేశారు’ అని ఆరోపించారు.
స్వేచ్ఛగా ధర్నా చేసి.. ప్రజాస్వామ్యం లేదంటారా: నిమ్మల
‘పులివెందులలో జగన్ స్వేచ్ఛగా ర్యాలీ తీశాడు. ధర్నా చేశాడు. ఇంతచేసీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం విడ్డూరంగా ఉంది’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పచ్చకామెర్ల వాడకి లోకమంతా పచ్చగా కనిపించినట్లు... వైసీపీ నేత సజ్జలకు అడుగడుగునా కుట్రలే కనిపిస్తున్నాయి. పోలింగ్ బూతుల్లో ఉండాల్సిన ఏజెంట్లను జగన్ తన ర్యాలీలు, ధర్నాల్లో తిప్పుకొని చివరకు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదని ఆరోపించడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే జగన్ బెంగళూరుకు వెళ్లి కూర్చోవడం ఏమిటి? రాష్ట్ర ప్రజల సమస్యలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు’ అని నిమ్మల అన్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో 9 వేల కోట్ల పంచాయతీ నిధుల దోపిడీ: నీలాయపాలెం
‘గ్రామాలను సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ ఐదేళ్ల పాలనకు దక్కుతుంది. పంచాయతీల నిధులను దోపిడీ చేసి వాటిని నిర్వీర్యం చేసిన జగన్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ కోరారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్ల పాలనలో పంచాయతీ వ్యవస్థను అత్యంత అన్యాయంగా దోచుకున్నారు. సుమారు రూ.9 వేల కోట్ల పంచాయతీ నిధులను దోపిడీ చేశారు. రాష్ట్ర నిధులు పైసా ఖర్చు చేయకపోగా కేంద్రం పంపిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులనూ మింగేశారు. చివరికి ప్రజలపై చెత్తపన్ను భారం మోపి ఆ పన్నుతో పంచాయతీలు నడవలేని పరిస్థితికి తెచ్చారు. అలాంటి జగన్ ఏ మొహం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు?’ అని నీలాయపాలెం ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి