న్యాయమూర్తుల నడవడిలో గీతాసారం ప్రతిఫలించాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:43 AM
న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కే ప్రతి మనిషికీ న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరగాలంటే భగవద్గీత సారం న్యాయమూర్తుల నడవడిలో ప్రతిఫలించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సూచించారు.
అప్పుడే న్యాయవ్యవస్థపై అందరికీ విశ్వాసం పెరుగుతుంది
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి
కురుక్షేత్ర, నవంబరు 2: న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కే ప్రతి మనిషికీ న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరగాలంటే భగవద్గీత సారం న్యాయమూర్తుల నడవడిలో ప్రతిఫలించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సూచించారు. న్యాయమూర్తులు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన శ్రేష్ఠులుగా నడుచుకుంటే అది యావత్ న్యాయవ్యవస్థని, తద్వారా సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలదన్నారు. హర్యానా కురుక్షేత్రలో గురుకృప చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 24నుంచి జరిగిన ’మహాభారతంలో శ్రీకృష్ణ పాత్ర‘ ప్రవచనాల ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. ఇదే సభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ దైవ నామ స్మరణ ఒక్కటే భగవంతుణ్ణి మనసులో నిలుపుకునే మార్గమని అన్నారు. తన ప్రవచనాలను వినడానికి దేశవిదేశాల నుంచి వందలాది తెలుగువారు రావటం శ్రీకృష్ణుడిపై హిందూసమాజంలో ఉన్న భక్తి విశ్వాసాలకు అద్దం పడుతోందని రుషిపీఠం వ్యవస్థాపకుడు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ చెప్పారు.
ప్రవచనాలు ఏర్పాట్లు చేసిన గోవిందవజ్ఘల కామేశ్వరరావు, తూములూరి బాలాజీ బృందాన్ని ఆయన అభినందించారు. ప్రవచన కర్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ ఎలా జీవించాలో సూచించే దిక్సూచి మహాభారతమని సోదాహరణంగా వివరించారు. సీనియర్ పాత్రికేయులు జి.వల్లీశ్వర్, వారణాశిలోని తారకరామ ఆంధ్రాశ్రమం అధ్యక్షుడు సుందర శాస్త్రి ప్రభృతులు ప్రసంగించారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి