జవాబు చెప్పే ధైర్యముందా జగన్?
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:22 AM
‘వివేకా హత్యలో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయింది. రూ.40 కోట్ల సుపారీ.. ఆరోజు పేపరు ఉందని నారాసుర రక్తచరిత్ర అంటూ రాశారు. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడితే భస్మమే. లిక్కర్ స్కాంలోనూ అంతిమ లబ్ధిదారు జగనే అని అన్ని వేళ్లూ చూపుతున్నాయి.
వివేకా హత్యలో.. మద్యం స్కామ్‌లో..
అంతిమ లబ్ధిదారు జగనే.. అన్ని వేళ్లూ అటే..
గ్రూప్-1 అక్రమాలకూ సమాధానం చెప్పాలి
పిల్లల జీవితాలతో ఆటలాడుకున్నారు
ఆయన విధ్వంసానికి పల్లె కంట కన్నీరు
కూటమి ప్రభుత్వం మార్పు తెచ్చింది
పవన్ తనదైన మార్పు చూపించారు
మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో
36 ప్రాజెక్టులు చెప్పిన తేదీకి పూర్తి చేస్తాం
‘జలధార’కు రూ.30 వేల కోట్లు..
45 వేల గ్రామాల్లో 3.27 కోట్ల మందికి తాగునీరు
మోదీ సహకారం, పవన్ తపన.. నా అనుభవం
ఈ మూడింటితో బుల్లెట్ స్పీడ్‌లో సర్కారు: సీఎం
కడప, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘వివేకా హత్యలో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయింది. రూ.40 కోట్ల సుపారీ.. ఆరోజు పేపరు ఉందని నారాసుర రక్తచరిత్ర అంటూ రాశారు. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడితే భస్మమే. లిక్కర్ స్కాంలోనూ అంతిమ లబ్ధిదారు జగనే అని అన్ని వేళ్లూ చూపుతున్నాయి. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా’ అని సీఎం చంద్రబాబు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సవాల్ విసిరారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘జలజీవన్ మిషన్-అమరజీవి జలధార(జలజీవన్ మిషన్ 2.0)’ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలకూ జగన్ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల గ్రామాలు వెనుకబడిపోయాయని గుర్తుచేశారు. ‘నీరు లేదు.. రోడ్లు లేవు.. వీధి దీపాలు లేవు, బ్లీచింగ్ పౌడర్‌కు కూడా నిధులివ్వలేదు. రోడ్లపై గుంతలు తవ్వి ఇబ్బందులు పెట్టిన పార్టీ గొడ్డలి పార్టీ. ఆ విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లుపెట్టుకున్నాయి. ఆ పరిస్థితుల నుంచి కూటమి మార్పు తెచ్చింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తనదైన మార్పు చూపించారు. 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టిన ఏకైక ప్రభుత్వం, ఏకైక వ్యక్తి పవన్..’ అని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. అందులో కూడా పవన్ ముందున్నారని.. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచాలనేది ఆయన సంకల్పమని, దానికి సహకరించాలని ప్రజలకు పిలుపిచ్చారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సుపరిపాలనకు నాంది పలికామని.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
7 రోజుల్లో 9 కార్యక్రమాలు..
వారం రోజుల్లో తొమ్మిది కార్యక్రమాలు చేశాం. పల్లె పండుగ 3.0 కింద రూ.11,500 కోట్లతో గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేదలకు పట్టాభిషేకం, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి రూ.52వేల కోట్ల ఆస్తి వారి పేరుతో ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ర్టేషన్ చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. నిన్ననే రూ.3 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టాం. మరో 6 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. 2029లోపు 9 లక్షల మందికి ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మొన్ననే మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి కుటుంబానికి సురక్షితమైన నీరు, ప్రతి గ్రామానికీ స్థిరంగా నీరు.. ‘అమరజీవి జలధార’ పథకం ఉద్దేశం. రూ.30 వేల కోట్ల వ్యయంతో 45 వేల గ్రామాలు, 90 లక్షల ఇళ్లు, 3.27 కోట్ల మందికి కొళాయి ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం మొదలైంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్వచ్ఛమైన నీటితో మెరుగైన ఆరోగ్యం అందుతుంది.
ప్రతి ఇంటికీ నీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ జలజీవన్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్ రూ.లక్ష కోట్లు తీసుకుంది. రాజస్థాన్ రూ.85 వేల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.83 వేల కోట్లు, కర్ణాటక రూ.63 వేల కోట్లు, అస్సాం రూ.36 వేల కోట్లు తీసుకున్నాయి. కానీ మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ రూ.2700 కోట్లే ఖర్చు చేసింది. చిన్న రాష్ట్రాలు పెద్ద అడుగు వేస్తే పెద్ద రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. శాశ్వత నీటి వనరులు అంటే గండికోట, శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల నుంచి నీటిని తీసుకెళ్లాలి. కానీ వీళ్లు బోర్లు వేసి అక్కడ ఓవర్‌హెడ్ ట్యాంక్ కట్టి నీళ్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక పంచాయతీలకు రూ.4136 కోట్లు ఇప్పించారు. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో రెండున్నర దశాబ్దాల తర్వాత వివిధ క్యాడర్లలో 10 వేల మందికిపైగా పదోన్నతులు కల్పించారు. ఆయన నాయకత్వంలో ఆ శాఖకు 13 జాతీయ అవార్డులు వచ్చాయి. అడవి తల్లికి బాట వేశారు.. పల్లెల అభివృద్ధికి రూటు వేశారు..
తెలుగుతల్లికి జలహారతి బాధ్యత మాది..
తాగునీరు మాత్రమే కాదు, సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నదే మా సంకల్పం. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వం దాని దిశ-దశ మార్చింది. సీమ అభివృద్ధికి రూ.24 వేల కోట్లు ఖర్చుచేశాం. అదే గొడ్డలిపార్టీ ఐదేళ్లలో రూ.2500 కోట్లే ఖర్చుపెట్టింది. పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు పంపించి.. కృష్ణా జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా ఫేజ్-1 పూర్తిచేసి సీమ రిజర్వాయర్లన్నీ నింపాం. వెలిగొండ ఫేజ్-1 పూర్తిచేసి నల్లమల సాగర్‌కు నీళ్లిచ్చాం. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లాం. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి తెలుగుతల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాది. గొడ్డలి పార్టీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కాపాడతామని స్పష్టమైన హామీ ఇచ్చాం. అటు మోదీ సహకారం, పవన్ తపన.. ఇటు నా అనుభవం ఉంది. ఈ మూడింటితో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్‌లో పయనిస్తోంది. స్థానిక సంస్థల్లో అందరినీ గెలిపించుకుంటే ట్రిపుల్ ఇంజన్ సర్కారు వస్తుంది. రాయలసీమలో రాయల్ బుల్లెట్ తయారీ పరిశ్రమ వస్తోంది.. ఇక్కడకు బుల్లెట్ ట్రైన్ కూడా వస్తోంది. రప్పా రప్పా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు వద్దు. నేరాలు, ఘోరాలకు పోవద్దు. ఉచిత ఇసుక ప్రజల హక్కు. వారిని మోసం చేస్తే చూస్తుండడానికి నేను 2019 నాటి ముఖ్యమంత్రిని కాదు..4.0 ముఖ్యమంత్రిని.
ప్రతిపక్ష హోదా ప్రజలివ్వాలి..
జగన్ అసెంబ్లీకి రమ్మంటే రాడు, ప్రతిపక్ష హోదా కావాలంటాడు. అది నేనిచ్చేది కాదు.. ప్రజలివ్వాలి. 2019లో టీడీపీ 23 సీట్లు గెలిచింది. జగన్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. ‘23 మంది గెలిచారు. ఇది దేవుడు రాసిన స్ర్కిప్టు. నేను ఐదు మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది’ అని నన్ను హేళన చేశారు. ప్రతిపక్ష హోదా కోసం ఎన్ని సీట్లు కావాలో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసీ డ్రామాలు ఆడుతున్నారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్
ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ప్రతి పని యజ్ఞంలా చేస్తున్నాం, రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. సూపర్ సిక్స్‌ను సూపర్‌హిట్ చేశాం. రూ.76 వేల కోట్లు పింఛన్లకు ఖర్చుచేశాం. అన్నదాత సుఖీభవ రూ.20 వేలు, తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఇచ్చాం. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ ఇచ్చాం. ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మోదీ నాయకత్వంలో నాది, నా మిత్రుడు పవన్ కల్యాణ్‌ది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం