సీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:42 PM
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
కుంటిమద్ది చెరువు వద్ద గంగపూజ
రామగిరి(అనంతపురం): రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును శుక్రవారం ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాయలసీమకు ఏదో ద్రోహం జరిగిపోయిందని ఊగిపోతున్న వైసీపీ నాయకులకు కళ్లముందే హంద్రీనీవా నీరు పారుతున్న దృశ్యాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ప్రస్తుతం 40 టీఎంసీల మేర నీరు వస్తోందంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపే కారణమన్నారు.
గత ఐదేళ్లలో సీమకు నీరందించే ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందో చెప్పగలరా అని నిలదీశారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. పరిటాల రవీంద్ర అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో రూ.804 కోట్లతో రెండు రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పనులు ప్రారంభమయ్యాయన్నారు. కొంతవరకు భూసేకరణతోపాటు 30 శాతం కాలువ పనులు చేశారన్నారు. తరువాత వైసీపీ హయాంలోఓ ఏం పనులు చేశారో చెప్పాలంటూ నిలదీశారు.
ఉన్నవి రద్దు చేసి.. కొత్తవి తెస్తామని ప్రగల్భాలు పలికి.. ఆఖరుకు చేసింది ఏమీలేదన్నారు. అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించి, రూ.900 కోట్లు కొల్లగొట్టారన్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేనికారణంగా 2020లోనే ఆపేశారన్నారు. కూటమి ప్రభుత్వం 19 నెలల్లోనే రూ.8వేల కోట్లు సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసిందన్నారు. వైసీపీ నేతలు ఉనికి కాపాడుకునేందుకే మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి వార్నింగ్
ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
Read Latest Telangana News and National News