మా ప్రయారిటీ హంద్రీనీవా ప్రాజెక్టు: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Apr 14 , 2026 | 08:35 PM
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అనంతపురం: వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమలో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ నాయకులకు చెప్పుకోవడానికి ఏమీలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగిపోయిందో, అనంతపురానికి ఎంత నీరు వస్తుందో వివరించాలని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2020 అక్టోబర్ 29న స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేయడంతో మళ్లీ విచారణ జరిగిందని చెప్పారు. 2021 జులై 7న చీఫ్ సెక్రటరీ ఇచ్చిన అఫిడవిట్‌లో పనులు ఆగిపోయాయని స్పష్టం చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ఆగిపోయిన ప్రాజెక్టును చంద్రబాబు ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఆగిపోయాక నాలుగేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఏం చేసిందని నిలదీశారు.
కూటమి ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు ప్రాధాన్యమిస్తోందని పయ్యావుల తెలిపారు. గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి రూ.3100 కోట్లు, కిరణ్ కుమార్ రెడ్డి రూ.3600 కోట్లు ఖర్చు చేశారని, చంద్రబాబు నాయుడు కూడా రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కేవలం మూడు టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉందని, అది కేవలం కొన్ని రోజులపాటు మాత్రమే నీటిని అందించగలదని అన్నారు. అసలు రైతులకు ఉపయోగం ఎంత ఉంటుందో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైసీపీ తమ ప్రభుత్వంలో రాయలసీమకు సంబంధించిన 120 ప్రాజెక్టులను రద్దు చేసిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
Also Read:
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
ఎస్ఆర్‌హెచ్‌కు క్రేజీ న్యూస్.. జట్టులో చేరనున్న ప్యాట్ కమిన్స్!
For More Latest News