ఆట.. పాట.. ఆరోగ్యం
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:17 AM
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, ఆరోగ్యాన్ని పరిరక్షించే కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతోంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇదే విధానం
అక్షరాలు దిద్దడంతోపాటు ఆటపాటలతో నైపుణ్యాలు
పోషకాహార, ఆరోగ్య కేంద్రంగా రూపాంతరం
బాలింతలు, గర్భిణులకు ప్రతినెలా టీహెచ్‌ఆర్ కిట్లు
అంగన్‌వాడీ కేంద్రాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ
అనంతపురం: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, ఆరోగ్యాన్ని పరిరక్షించే కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఇక్కడ అక్షరాలు దిద్దించడంతో పాటు అనేక రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అనేక యాక్టివిటీలు
పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదల కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు అనేక యాక్టివిటీలు చేయిస్తున్నారు. పిల్లలందరితో కలిసి ప్రార్థనలు నిర్వహించడం, దేశభక్తి గీతాలు పాడించడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయిస్తున్నారు. గోళ్లు, దుస్తులు, జుట్టు శుభ్రంగా ఉండేలా వ్యక్తిగత పరిశుభ్రత పరిశీలన చేయిస్తున్నారు. ఈరోజు ఏ వారం, ఏ తేదీ, నెల, వాతావరణం ఎలా ఉందో పిల్లలచేత చెప్పిస్తున్నారు. ఇళ్లవద్ద ఏం చేశారు. ఏం తిన్నారు వంటి విషయాలను స్వేచ్ఛగా మాట్లాడించి వారిలోని భయాన్ని పోగొడుతున్నారు. బొమ్మల పుస్తకాలు, హావభావాల ద్వారా నీతి కథలను చెబుతున్నారు. యాక్షన్ చేస్తూ తెలుగు, ఇంగ్లిష్ పద్యాలు నేర్పిస్తున్నారు. చార్టులు, రంగుల ఆట వస్తువుల ద్వారా ప్రాథమిక రంగులు, వివిధ ఆకారాలను గుర్తించడం నేర్పుతున్నారు.
పెద్ద, చిన్న, ఎక్కువ, తక్కువ, బరువైన, తేలికైన వస్తువుల మధ్య తేడాలను గుర్తించేలా చేయిస్తున్నారు. చిన్నచిన్న పజిల్స్ పూర్తి చేయడం, వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చడం. రంగుల పెన్సిళ్లు ఉపయోగించి బొమ్మల్లో రంగులు నింపడం, కాగితాలను మడవడం, చింపడం, వాటితో పడవ, విమానం వంటి వస్తువులు చేయిస్తున్నారు. ప్లే-డో(జిగురు మట్టి) ఉపయోగించి రకరకాల పండ్లు, కూరగాయల బొమ్మలు తయారు చేయించడం. ఆటల ద్వారా నడవడం, పరిగెత్తడం, దూకడం, హూలాహూప్ రింగ్స్ ఆడించడం. చిత్రాలలో చూసినట్లుగా పలకపై బలపంతో రాయడం. పూసలు దారంలో గుచ్చడం, చిన్న వస్తువులను వేళ్లతో పట్టుకోవడం. వస్తువుల సాయంతో అంకెలను లెక్కించడం. తెలుగు అచ్చులు, ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ చదవడం, రాయడం బోర్డుపై సాధన చేయిస్తున్నారు.
ఆరోగ్య పర్యవేక్షణ...
పిల్లల శారీరక ఎదుగుదలను ట్రాక్ చేస్తున్నారు. ఇందులో ప్రతి నెల సాల్టర్ స్కేల్‌తో బరువును, స్డేడియోమీటర్ ద్వారా ఎత్తును గుర్తిస్తున్నారు. ఈ వివరాలను గ్రోత్ చార్ట్‌లో నమోదు చేస్తున్నారు. తక్కువ బరువు. పౌష్టికాహార లోపం, మధ్యస్థ పౌష్టికాహార లోపమున్న పిల్లలను కేటగిరీలుగా గుర్తిస్తారు. అవసరమైన పిల్లలను న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీకి) రెఫర్ చేస్తారు. ఆశా, ఏఎన్‌ఎంల సమన్వయంతో అంగన్‌వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. తద్వారా పోలియో, బీసీజీ, డీపీటీ, తట్టు వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకా వేయిస్తున్నారు.
ప్రాథమిక వైద్యకేంద్రం డాక్టర్లు, రాష్ర్టీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) బృందం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. పిల్లల్లో కళ్లు, పళ్లు, చర్మం వంటి సాధారణ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. రక్తహీనత గుర్తించిన పిల్లలకు ఐరన్, పోలిక్ యాసిడ్ సిర్‌పలను అందజేస్తారు. కడుపులో నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ టాబ్లెట్, సిరప్. రే చీకటిని నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి విటమిన్-ఏ సిరప్ తాగిస్తారు. ఈ వివరాలను ప్రతిరోజు పోషణ్ ట్రాకర్ యాప్‌ద్వారా డిజిటల్‌గా నమోదుచేసి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
బాలామృతం
అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే రోజవారి ఆహారానికి అదనంగా బాలామృతం పంపిణీ చేస్తున్నారు. శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన అనుబంధ పోషకారంగా 2.5కేజీల బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నారు. ప్రతి వంద గ్రాముల బాలామృతం నుంచి సుమారు 414 కిలో కేలరీల శక్తి, 11 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దీంతోపాటు ఐరన్, కాల్షియం, విటమిన్-ఏ,బీ,సీ వంటి అనేక సూక్ష్మ పోషకాలు పిల్లలకు అందుతాయి.
టీహెచ్‌ఆర్‌తో పౌష్టికాహారం
ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 వంటి సూక్ష్మపోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం మూడు కేజీలు. కేజీ కందిపప్పు, రాగిపిండి, అటుకులు, 25 కోడిగుడ్లు, ఐదు లీటర్ల పాల ప్యాకెట్లు, అర కేజీ చొప్పున బెల్లం, వంట నూనె ప్యాకెట్, వేరుశనగ, బెల్లంతోచేసిన పోషక గుణాలున్న ప్యాకెట్, బలానిచ్చే ఎండు ద్రాక్ష ప్యాకెట్‌తోకూడిన టీహెచ్‌ఆర్ కిట్‌ను గర్భిణులు, బాలింతలకు నెలవారిగా అందజేస్తున్నారు. మహిళల్లో, పుట్టబోయే బిడ్డలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివరించడానికి పోషకాల సమతుల టీహెచ్‌ఆర్ కిట్‌ను పోషణ్ పథకం ద్వారా ఉచితంగా అందిస్తున్నారు.
ప్రవేశాలు పెరిగాయి: శశికళ, ఐసీడీఎస్ పీడీ
రెండేళ్ల నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పిల్లలకు అక్షరాలు దిద్దించడమే కాకుండా వారిలో విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆటలు, పాటలతో శారీరక, మానసికంగా ఎదిగేలా చూస్తున్నాం. సమతుల ఆహారాన్ని రోజువారి మెనుగా అందజేస్తున్నాం. డిజిటల్ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదుచేసి లోపాలను చక్కదిద్దుతున్నాం. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు టీహెచ్‌ఆర్ కిట్‌ద్వారా పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.
అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు
Read Latest AP News And Telangana News And International News And Telugu News