Share News

పదోసారి సవాల్‌..!

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:16 AM

‘‘పదోసారి సవాల్‌ విసురుతున్నా. డీఎస్సీపై చర్చకు టైమ్‌, డేట్‌, ప్లేస్‌ మీరే నిర్ణయించండి. పులివెందులకైనా, తాడేపల్లి కొంపకైనా వస్తా. మీరు సిద్ధమా?’’ అంటూ వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

పదోసారి సవాల్‌..!

  • డీఎస్సీపై చర్చకు డేట్‌, టైమ్‌,ప్లేస్‌ మీరే చెప్పండి

  • పులివెందులకైనా, తాడేపల్లికైనా వస్తా

  • జగన్‌కు మంత్రి నారా లోకేశ్‌ సవాల్‌

  • వచ్చే మూడేళ్లలో మరికొన్ని డీఎస్సీలు

  • జగన్‌ తప్పులకు వైసీపీ నేతలు బలవుతున్నారు

  • మరో 3 సార్లు మనం గెలిస్తేనే రాష్ట్రం గాడిలోకి

  • ఒంగోలు టీడీపీ కార్యకర్తల భేటీలో నిర్దేశం

ఒంగోలు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ‘‘పదోసారి సవాల్‌ విసురుతున్నా. డీఎస్సీపై చర్చకు టైమ్‌, డేట్‌, ప్లేస్‌ మీరే నిర్ణయించండి. పులివెందులకైనా, తాడేపల్లి కొంపకైనా వస్తా. మీరు సిద్ధమా?’’ అంటూ వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారు కూడా తమకు నీతులు చెప్పేందుకు సిద్ధమయ్యారంటూ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. డీఎస్సీపై 150 కేసులు వేయించినా విజయవంతంగా 16వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గ్రూపు-1 ఉద్యోగాలపై కోర్టులో విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందని అన్నారు. రానున్న మూడేళ్లు కూడా డీఎస్సీ నిర్వహిస్తామని, జగన్‌ కాదు, ఆయన తాతలు వచ్చినా అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే పెట్టి రాజకీయ లబ్ధి కోసం జగన్‌ జాతికి అంకితం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తాము పనులన్నీ పూర్తి చేసి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి నీటిని ఇస్తుంటే... క్రెడిట్‌ చోరీ అంటున్నారని ఆగ్రహించారు. వెలిగొండకు శంకుస్థాపన చేసింది చంద్రబాబేనని, ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నది కూడా బాబేనని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే..


మరో మూడు సార్లు మనమే గెలవాలి

‘‘రాష్ట్రం గాడిలో పడాలంటే మరో మూడు సార్లు మనమే మళ్లీ గెలవాలి. అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి 94శాతం సీట్లను గెలిచాం. స్థానిక ఎన్నికల్లో మరో రెండు శాతం అధికంగా గెలవాలి. అన్ని అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం పూర్తి స్పష్టతతో ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది. వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డాం. అక్రమ కేసులు పెట్టి వేధించారు. నాపై 23 కేసులు పెట్టారు. జగన్‌లా కంచుకోటలో నేను పోటీ చేయలేదు. 40 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళగిరిలో పోటీ చేసి 91వేల మెజారిటీతో గెలిచా. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణం. నాయకులు, కార్యకర్తలు అహంకారం వదిలి కలిసికట్టుగా పనిచేయాలి. మారిన కాలానికి అనుగుణంగా 2025 మహానాడులో ఆరు శాసనాలు చేశాం. వాటిలో ఒకటైన కార్యకర్తే మా అధినేత అనే శాసనం నాకు ఇష్టం. ఇప్పటి వరకు సుమారు రూ.160 కోట్లు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చుచేశాం. కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన దొంగ కేసులు, అక్రమ కేసులను తొలగించే ప్రక్రియ చేపట్టాం. ఇప్పటికే 80శాతం తొలగించాం.’’

ఉద్యోగ, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం

‘‘సంక్షేమంతోపాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మహిళలు, ఆటో కార్మికులు, రైతులు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం. నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సుమారు 17వేల మంది బీసీలకు వివిధ పదవులు కల్పించాం. రాజకీయంగా, సామాజికంగా వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం, పార్టీ కృషి చేస్తోంది.’’


రాజకీయ కక్షలకు అతీతంగా పాలన

‘‘గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు విపరీతంగా జరిగాయి. మన ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలకు తావు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగిస్తున్నాం. జగన్‌ చేసిన తప్పులకు ఆ పార్టీ నేతలు బలవుతున్నారు. వరుసగా జైలుకు వెళ్తున్నారు. అక్రమాలు, దౌర్జన్యాలు యథేచ్ఛగా చేసి అక్రమ సంపాదన చేసిన వారిపై నేడు చట్ట పరిధిలో చర్యలు చేపడితే కులం కార్డు తీస్తున్నారు. పార్టీని కార్యకర్తలు మరింత బలోపేతం చేయాలి. సమస్యలను ఎక్కడికక్కడ స్థానికంగా పరిష్కరించుకోవాలి. సాధ్యం కాకపోతే వాటిని పార్టీ ఉన్నత స్థాయి కమిటీల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప వీధికి ఎక్కకూడదు’’ అని లోకేశ్‌ సూచించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పనితీరును అభినందించారు. సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్స్ అరెస్ట్

రోజంతా బిజీబిజీ.. పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం..!

Updated Date - Aug 29 , 2026 | 05:40 AM