రోజంతా బిజీబిజీ.. పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం..!
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:57 PM
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైంది. గురువారం ఒంగోలులోని పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి లోకే్‌షకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు.
కిమ్స్ సమీపంలో మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ
నగర తాగునీటి అవసరాలకు రూ.424.42 కోట్లతో చేపట్టే పనులకు పైలాన్ ఆవిష్కరణ
తెలుగు తమ్ముళ్లు భారీ బైక్ ర్యాలీ, ఆకర్షణగా లోకేష్ రోడ్ షో
ఎమ్మెల్యే దామచర్ల ఆధ్వర్యంలో అడుగడునా ఘన స్వాగతం
రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు మహిళలు
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైంది. గురువారం ఒంగోలులోని పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి లోకే్‌షకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా తొలిసారిగా ఒంగోలు విచ్చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. మంత్రి కాన్వాయ్ ముందు భారీ బైక్ రాలీ నిర్వహించడంతోపాటు, గజమాలు, బాణసంచాలు, పూలతో ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి, అదే సమయంలో నగరానికి విశేష సేవలు అందించిన 20 మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామితోపాటు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైౖర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంగోలులో జరిగిన కార్యక్రమాలలో మంత్రి లోకేష్ బిజీబిజీగా కనిపిస్తూ, ప్రతి ఒక్కరినీ ప్రేమతో పలకరిస్తూ,ప్రజలతో మమేకమయ్యారు.
మహనీయుల సేవలు భావితరాలకు తెలియాలి
మహనీయుల సేవలు భావితరాలకు తెలియజేయడమే లక్ష్యమని, వారి స్ఫూర్తితో నేటి తరం మరెన్నో సేవలు, విజయాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఒంగోలు మునిసిపాలిటీ 150 వేడుకల సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన 20 మంది విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ స్ఫూర్తిదాతల ఆలోచనలు నేటి యువతకు తెలియజేసేలా విగ్రహాలు ఏర్పాటు అభినందనీయమన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయం, సాహిత్యం తదితర రంగాల్లో ప్రముఖులుగా నిలిచిన వారి విగ్రహాలన్నీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని కొనియాడారు.ప్రజలకు నిత్యం కనిపించేలా విగ్రహాలు ఏర్పాటు చేయడం వారి సేవలు, త్యాగాలు వారి ఆశయాలు ప్రజలకు చేరవవుతాయన్నారు. అనంతరం ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల కుటుంబ సభ్యులను కలుసుకుని వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖల కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి ఆనందంగా గడిపారు.
ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు గిత్త
ఒంగోలు జాతి పశువులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేకతను గుర్తింపును చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్త విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒంగోలు గిత్త విశిష్టతను, భావి తరాలకు పరిచయం చేయడంతోపాటు, ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ఇదీ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
కార్యకర్తల్లో జోష్
మంత్రి లోకేష్ ఒంగోలు పర్యటనలో కార్యకర్తలో జోష్ కనిపించింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలతో ప్రతి డివిజన్ నుంచి యాభై బైక్‌లతో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రోవగుంట వద్ద నుంచి ఒంగోలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశం హాలు వరకు లోకేష్ కాన్వాయ్‌కు ముందు బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు చొక్కాలు ధరించి, పార్టీ జెండాలతో నగర వీధుల్లో కొనసాగిన బైక్ ర్యాలీలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే సమయంలో దామచర్ల ఆధ్వర్యంలో స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా సైకిళ్లతో స్వాగత ద్వారం ఏర్పాటు చేయగా, భారీ గజమాలతో లోకే్‌షను స్వాగతం పలికారు. అలాగే తెలుగు మహిళలు, కార్యకర్తలు రక్షాభందన్ పండుగ సందర్భంగా లోకే్‌షకు రాకీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ జంక్షన్ వద్ద వైశ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ యువనాయకులు పల్లపోతు దుర్గాప్రసాద్ (నానీ) ఆధ్వర్యంలో కేరళ సంప్రదాయ నృత్య ప్రదర్శనలతోపాటు మేళతాళాలతో అభినందనలు తెలిపారు. లోకేష్ రోడ్ షోలో భాగంగా దారిపొడవునా ఫ్లెక్సీలు, బాణసంచాలు, పూలతో శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
నగరానికి 24గంటలు నీటి సరఫరా దిశగా కీలక అడుగు
ఒంగోలు నగరాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా, 24 గంటలు తాగునీరు అందించేందుకు కీలక అడుగుల పడ్డాయి. మంత్రి లోకేష్ అమృత్ 2.0 పథకం ద్వారా రూ. 242.42 కోట్లుతో చేపట్టనున్న పనులకు సంబంధించి స్థానిక రంగారాయుడు చెరువు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిరంతర తాగునీటి సరఫరా త్వరలోనే నెరవేరబోతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరాన్ని 35 జోన్‌లుగా విభజించి, 13.975 కి.మీ శుద్ధి కేంద్రాలకు నీటి సరఫరా చేయు పైపులైను, త్రోవగుంట, కొప్పోలు, పబ్లిక్ హెల్త్ ఆఫీస్ కాంపౌండ్‌లోకోటి యాభై లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన మూడు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మాణం, 52.985 కి.మీ. శుద్ధి చేసిన తాగునీటి పంపింగ్ ప్రధాన పైపులైను నిర్మాణం, 18 ప్రాంతాల్లో తాగునీటి నిల్వ ట్యాంకులు పూర్తి చేసి, 605.30 కి.మీ పైపులైను నిర్మాణంతో 51,340 నివాసాలకు ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.