Kurma Village: ప్రకృతి ఒడిలో అందమైన గ్రామం కేరాఫ్ కూర్మగ్రామం..

ABN, Publish Date - Mar 11 , 2025 | 09:50 AM

Kurma Village: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలంలోని కూర్మగ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పోటీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి పురాతన పద్ధతులతోనే కూర్మగ్రామస్తులు జీవిస్తున్నారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలంలో గల కూర్మగ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పోటీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి పురాతన పద్ధతులతోనే కూర్మగ్రామస్తులు జీవిస్తున్నారు. కరెంట్, టీవీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండానే గ్రామస్తులు బతుకుతున్నారు. ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న గ్రామంగా కూర్మగ్రామం గుర్తింపు సాధించింది. గ్రామీణ ప్రజల పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దంలా ఉంది.


కూర్మగ్రామాన్ని 2018 జూలై నెలలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం 56 మంది కూర్మగ్రామంలో నివసిస్తున్నారు. అయితే బ్రిటిష్ వారి పాలనలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకుని కూర్మగ్రామస్తులు ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికతతో భాగమవుతూ.. ప్రకృతి ఒడిలోనే ఆనందంగా జీవిస్తున్నారు.


కుర్మగ్రామం ప్రత్యేక ప్రతినిధి త్రిబుల్ దానందా దాస్ గ్రామ విశేషతలు తెలిపారు. భగవద్గీత ఆధారంగా జీవిస్తున్నట్లు వివరించారు. కూర్మగ్రామం ఇంచుమించు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని తెలిపారు. తాము ఎక్కువగా ఇస్కాన్ సంస్థ నియమాలను పాటిస్తామని అన్నారు. తమ గ్రామంలో ఎక్కువగా కృష్ణుడిని పూజిస్తుంటామని తెలిపారు. ఇప్పుడు ఆహార పద్ధతుల్లో చాలా మార్పులు వస్తున్నాయని అన్నారు. ఎన్నో రసాయనాలు భూమిలో కలపడం వల్ల విషపూరితంగా మారుతుందని చెప్పారు.


రసాయనాలు కలిపిన విషపూరితమైన ఆహారం తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు మనం తినే ఆహారంలో పోషకాలు ఉండటం లేదని చెప్పారు. తమ గ్రామంలో ఎక్కువగా సేంద్రియ పద్ధతుల్లోనే పండిస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆవు పేడ, గోమూత్రంతోనే నాటు విత్తనాలు పండిస్తామని వివరించారు. ఈ గ్రామంలో ఎంతో కాలంగా జీవిస్తున్నామని చెప్పారు. పూర్వికులు ఎలాంటి సమస్యలు లేకుండా జీవించారని అన్నారు. అప్పుడు వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని.. ఇప్పుడు కాలక్రమంలో వస్తున్న మార్పులతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. పురాతన పద్ధతులను పాటిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారని పేర్కొన్నారు.


మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌.. రంగంలోకి రోబోలు..

ఈ వార్తలు కూడా చదవండి..

విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా విడుదల

For More AP News and Telugu News

Updated at - Mar 11 , 2025 | 09:55 AM