Share News

Ananya Nadella: అద్భుతం...అనన్య సామాన్యం!

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:50 AM

చూసింది.. చూసినట్టుగా బొమ్మ గీయడం అతి తక్కువ మందికే సాధ్యం. అందులోనూ ఏడో తరగతి చదివే అమ్మాయి.. తాను చూసిన దానికి తనదైన సృజనను జోడించి కాన్వా్‌సపై చిత్రంగా మార్చడం అద్భుతమే.

Ananya Nadella: అద్భుతం...అనన్య సామాన్యం!

  • పిన్న వయసులోనే కాన్వా్‌సపై అద్భుత చిత్రాలను ఆవిష్కరించిన అనన్య నాదెళ్ల

  • ప్రదర్శనను ప్రారంభించి, ఆశీర్వదించిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ

  • వాస్తవికతను ప్రతిబింబించేలా చిత్రాలు: మురళీమోహన్‌

హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): చూసింది.. చూసినట్టుగా బొమ్మ గీయడం అతి తక్కువ మందికే సాధ్యం. అందులోనూ ఏడో తరగతి చదివే అమ్మాయి.. తాను చూసిన దానికి తనదైన సృజనను జోడించి కాన్వా్‌సపై చిత్రంగా మార్చడం అద్భుతమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అనన్య నాదెళ్ల. ధ్యాన ముద్రలో ఉన్న శివయ్య, శక్తిస్వరూపిణి (పార్వతీ మాత) ఆనంద తాండవాన్ని ముక్కంటి వీక్షించడం, రామకోటి రాసుకుంటున్న తాతమ్మ, భాగ్యనగర కీర్తి ప్రతీక చార్మినార్‌ వద్ద సందడి.. ఇలా ఆమె చేతి నుంచి జాలువారిన 24 చిత్తరువులు ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. జూబ్లీహిల్స్‌లోని కదరి ఆర్ట్‌ గ్యాలరీలో అనన్య పెయింటింగ్స్‌తో మంగళవారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు సాగే ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, సినీనటుడు మురళీమోహన్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


ప్రదర్శనలోని చిత్రాలను ఆసాంతం తిలకించిన వేమూరి రాధాకృష్ణ.. మరింత వృద్ధిలోకి రావాలని అనన్యను ఆశీర్వదించారు. ‘‘చిన్న అమ్మాయి పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ అంటే.. ఏదో చిన్నగా ఉంటుందిలే అనుకున్నా. కానీ, ఇంత అద్భుతంగా ఉంటుందని కలలోనూ అనుకోలేదు. ప్రతి చిత్రమూ వాస్తవికతను ప్రతిబింబించే రీతిలో ఉంది’’ అని మురళీమోహన్‌ ప్రశంసించారు. ప్రముఖ చిత్రకారుడు, అనన్య గురువు ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా అనన్య శిక్షణ పొందుతోందని తెలిపారు. ఎక్రిలిక్‌ శైలిలో తాను ఈ చిత్రాలను గీశానని, అబ్‌స్ట్రాక్ట్‌, చార్‌కోల్‌ మాధ్యమాలను వినియోగించానని అనన్య నాదెళ్ల తెలిపారు. తనకు స్వతహాగా దేవతల చిత్రాలను గీయడమంటే ఆసక్తి అని వెల్లడించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి పత్రిక వైస్‌ ప్రెసిడెంట్‌ శృతి కీర్తి, ఏబీఎన్‌ చానెల్‌ డైరెక్టర్‌ అనూష, పారిశ్రామిక వేత్తలు బొల్లినేని కృష్ణయ్య, చుక్కపల్లి సురేశ్‌, అనన్య తల్లిదండ్రులు నందీప్‌, కావ్య, తాతయ్య నాన్నమ్మలు నాదెళ్ల సుబ్బారావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:50 AM