Panchayat Elections: తుది దశ గ్రామపంచాయతీ పోరు.. పలు చోట్ల ఉద్రిక్తతలు.. టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:53 PM
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
వికారాబాద్ జిల్లా, డిసెంబర్ 17: తెలంగాణ వ్యాప్తంగా తుది దశ గ్రామపంచయాతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పల్లెల్లో ఓట్ల సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాలు వచ్చి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. ఆతరువాత ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారి తీశాయి. బీఆర్‌ఎస్ - కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. సర్పంచ్ అభ్యర్ధులపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు.
సర్పంచ్ అభ్యర్థిపై దాడి...
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో రాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిపై బీఆర్‌ఎస్ నేతలు దాడి చేశారు. గాయపడిన వారిని వెంటననే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలింగ్ బూత్‌లో ఉన్న కొంతమంది ఏజంట్‌లు పలు పార్టీలకు ఓట్లు వేయాలంటూ బలవంతం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ స్నేహ మెహ్రా పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్వల్ప తోపులాట...
మరోవైపు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
బీఆర్ఎస్ - కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
అటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ముకుమ్మడి దాడికి దిగారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు నాలుగురు కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన భూక్య స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన మహిళను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు
ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..
Read Latest Telangana News And Telugu News