Medaram Temple Development: ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క..
ABN , Publish Date - Sep 15 , 2025 | 09:18 PM
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
ములుగు: పగిడిద్దరాజు, గోవిందరాజు వంశస్తుల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారమే మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ నిర్మాణ పనులు ఉంటాయని మంత్రి సీతక్క తెలిపారు. వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మేడారంలో పర్యటించి సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 'సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయానికి కొస్తే డిజైన్ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉండదు. పూజారులు, స్థానికుల అభిప్రాయం మేరకే డిజైన్లు రూపొందిస్తాం. పూజారుల ఆలోచనల మేరకే ఆయన అభివృద్ధికి అడుగులు వేస్తాం. సమ్మక్క-సారలమ్మ తల్లులపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో నమ్మకం ఉంది. తల్లుల దీవెనలతో ఇక్కడి నుంచి పాదయాత్ర చేసి తాను అధికారంలోకి వచ్చినట్టు ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు. భక్తులకు మరింత సులభంగా తల్లుల దర్శన భాగ్యం కల్పించేందుకు పూజారుల సూచన మేరకు గుడి విస్తీర్ణాన్ని పెంచుతున్నాం.
యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టి మహాజాతర లోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఆదివాసీ జాతి బిడ్డగా నేను, సమ్మక్క-సారలమ్మ తల్లుల భక్తుడిగా సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి సారించి మేడారం గుడిని అభివృద్ధి చేస్తున్నాం. మేడారంలో భక్తులకు తల్లుల దర్శనంతోపాటు, వారి త్యాగాల చరిత్రను తెలియచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే మేడారంలో రేవంత్ రెడ్డి పర్యటించి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. పూజారులు చెప్పినట్లే నడుచుకుంటున్నాం. ఎక్కడా బయట వ్యక్తుల ప్రమేయం ఉండదు. తప్పుడు ప్రచారం చేస్తే తల్లుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది' అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News