CM Chandrababu Meeting With Collectors: ఎక్కడా రాజీ పడొద్దు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ABN , Publish Date - Sep 15 , 2025 | 07:56 PM
కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లాజిస్టిక్స్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి విభాగాలపై జిల్లా కలెక్టర్లతో ఇవాళ (సోమవారం) సమీక్ష నిర్వహించిన ఆయన.. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
లాజిస్టిక్స్ కీలకం
ఏపీ అభివృద్ధిలో లాజిస్టిక్స్ రంగం కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకంతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. జల్ జీవన్ మిషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోందని, ఎయిర్ పోర్టులూ హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. లాజిస్టిక్స్ విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్లను ఆదేశించారు.
రహదారుల నిర్మాణం
గోతులు లేకుండా రహదారుల నిర్మాణం త్వరగా జరగాలన్నారు చంద్రబాబు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతల రహిత రహదార్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 5,946 కిలోమీటర్ల రోడ్లలో గుంతలు పూడ్చేందుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న 4,229 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ.2వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. పీపీపీ మోడ్‌లో 12,653 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేయాలని ప్రణాళిక చేశామన్నారు. వానాకాలంలో రహదారుల సంరక్షణ కోసం ఎకోఫిక్స్ పద్ధతిని అనుసరించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు.
నీటి భద్రత
ప్రధాన, ఉప ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు వందశాతం నీటితో నిండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి భద్రతపై తీసుకున్న చర్యలతో తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. జూన్‌లోనే నారుమళ్లకు నీళ్లు విడుదల చేస్తామని, రబీ సీజన్‌కూ నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ ప్రాముఖ్యతను వివరించి, చెక్ డ్యామ్‌లు తనిఖీ చేసి పునరుద్ధరించాలని సూచించారు. వర్షపు నీటి రీఛార్జ్ చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
పరిశుభ్రత
ఏపీలో పరిశుభ్రమైన నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఉండాలని సీఎం సూచించారు. స్వచ్ఛత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Also Read:
న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి
లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
For More Latest News