Share News

CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో ‘టెక్‌’ బోధన!

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:16 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత (టెక్‌) ఆధారిత బోధనకు పునాది పడుతోంది. విద్యార్థులకు వీడియో ఆధారిత బోధన, కంప్యూటర్‌ కోడింగ్‌, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమైంది.

CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో ‘టెక్‌’ బోధన!

  • సాంకేతికత ఆధారిత పాఠాల కోసం ఆరు ఎన్జీవోలతో విద్యా శాఖ ఒప్పందం

  • ‘స్టెమ్‌’ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన

  • కోడింగ్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌తోపాటు నీట్‌, జేఈఈ, క్లాట్‌ పోటీ పరీక్షలకు శిక్షణ

  • బాలికల అక్షరాస్యత.. విద్యావకాశాల పెంపు

  • ఉచిత కార్యక్రమాల్ని చేపట్టనున్న సంస్థలు

  • రాష్ట్ర విద్యా రంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత (టెక్‌) ఆధారిత బోధనకు పునాది పడుతోంది. విద్యార్థులకు వీడియో ఆధారిత బోధన, కంప్యూటర్‌ కోడింగ్‌, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆరు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఎన్జీవోలతో రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యా రంగంలో నూతన ఒరవడికి నాంది పలికే ఈ ఒప్పందం ద్వారా.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు ఉచితంగా అత్యాధునిక బోధన ేసవలు అందుతాయని విద్యాశాఖ తెలిపింది. ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్‌, ప్రజ్వల ఫౌండేషన్‌, ఫిజిక్స్‌ వాలా, ఖాన్‌ అకాడమీ, ఫైజామ్‌ ఫౌండేషన్‌, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థలతో ఇందులో భాగస్వాములుగా నిలిచాయని వెల్లడించింది.


ప్రాథమిక స్థాయి నుంచే ఆధునిక శిక్షణ..

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ .. ఇప్పటికే రాష్ట్రంలోని 540 ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక ేసవలు అందిస్తోందని.. త్వరలో 33 జిల్లాల్లోని 5,000కుపైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుందని విద్యాశాఖ తెలిపింది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతోపాటు గణితం సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇస్తుందని వెల్లడించింది. ఇక అలోక్‌ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌ వాలా సంస్థ 12వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు నీట్‌, జేఈఈ, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత శిక్షణ అందిస్తుందని పేర్కొంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీ పరీక్షల దృక్కోణాన్ని కల్పిస్తుందని తెలిపింది.


ఖాన్‌ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌) పాఠాలతో శిక్షణను అందిస్తుందని వివరించింది. డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్‌ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపింది. షోయబ్‌దార్‌ నిర్వహిస్తున్న ఫైజామ్‌ ఫౌండేషన్‌ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌లో శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ వెల్లడించింది. సఫీనా హుస్సేన్‌ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థ పాఠశాలలకు దూరంగా ఉన్న 16వేల మందిపైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సహాబాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాల పెంపుపై పనిచేస్తుందని తెలిపింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎంవో అధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

For Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:48 AM