Share News

Telangana: మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేస్తే.. 25% రాయితీ

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:55 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

Telangana: మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేస్తే.. 25% రాయితీ
Telangana Land Registrations

  • అనధికారిక లేఅవుట్‌లో 10% శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే..

  • మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతి

  • దరఖాస్తుల పరిష్కారంపై ఇక రోజువారీ సమీక్ష.. ప్రక్రియ వేగవంతం

  • డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమీక్షలో నిర్ణయాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌పై సచివాలయంలో బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనధికారిక లేఅవుట్‌లో కేవలం 10 శాతం ప్లాట్లు రిజిస్టర్‌ అయి ఉండి.. మిగిలినవి రిజిస్టర్‌ కాకపోతే ఆ 90 శాతం ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. ప్లాట్‌ కొనుగోలుకు సంబంధించి సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న వారికి కూడా 25 శాతం రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25.7 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా.. వాటిలో 9 లక్షల దరఖాస్తులనే పరిష్కరించారు. అందులో కూడా క్రమబద్ధీకరణకు అనుమతించిన దరఖాస్తులు కేవలం 1,70,000 మాత్రమే. వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావించినా ఆశించిన పురోగతి కనిపించలేదు. గత ఏడాది ఆగస్టులో ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రకటన చేసినా.. ఇప్పటి వరకు కేవలం రూ.120 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. దరఖాస్తుల పరిష్కారంలో అనుకున్నంత వేగం లేకపోవడంతో ఈ పథకం అమలుపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రులు నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల విషయంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉండే అనధికారిక లేఅవుట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిశీలన సులభతరం చేయాలని ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్‌కార్యాలయాల వద్ద కూడా రిజిస్ట్రేషన్‌కు వెళ్లి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించవచ్చని సూచించారు.


ముందుకొచ్చేనా?

ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో.. దరఖాస్తుదారుల స్పందన ఎంతమేరకు ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఏడు నెలల క్రితం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నా దరఖాస్తుదారుల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. 60 శాతం దరఖాస్తులకు.. అవసరమైన అన్ని రకాల పత్రాలూ జత చేయకపోవడం, ఇప్పుడు వాటిని అప్‌లోడ్‌ చేయాలని అధికారులు సూచించినా పెద్దగా స్పందించకపోవడంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తాజాగా 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, ఈ రాయుతీ కూడా మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేయడంతో ప్రస్తుతం మిగిలి ఉన్న 39 రోజుల వ్యవధిలోనే వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. రాయితీ ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేదని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 10:37 AM