BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లుపై విచారణ వాయిదా..
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:56 PM
బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు.. బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టింది..
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ హైకోర్టు తీర్పును రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు.. బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటినుంచి పెండింగ్‌లో ఉంది?, ట్రిపుల్ టెస్టు విధానం అమలు చేశారా?, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు?, కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ చేశారా?, ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా?.. అంటూ హైకోర్టు ప్రశ్నించింది. షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని కూడా ఏజీని ప్రశ్నించింది. వాదనలు ఇంకా వినిపించాల్సి ఉన్నందున విచారణ రేపటికి వాయిదా వేయాలని ఏజీ కోరింది. ఇదిలా ఉండగా, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం.. జీవో 9ని జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సముద్రాల రమేశ్, బుట్టెంబారి మాధవరెడ్డి.. పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ.. సోమ, మంగళవారాల్లో పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్‌కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు మంగళవారం ఈ పిటిషన్‌లు దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా, బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు విచారణలో ట్రిపుల్ టెస్ట్ అంశం కీలకంగా మారింది. ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరంటూ పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం.. 2021 డిసెంబర్‌లో ట్రిపుల్ టెస్ట్‌పై మార్గదర్శకాలు ఉన్నాయంటూ గుర్తు చేశారు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు.. రిజర్వేషన్ల శాతం తేల్చాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నట్లు పిటిషనర్ తరఫు లాయర్ గుర్తు చేశారు.
అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదని, బీసీ కులగణన చేశారు కానీ బహిర్గతం చేయలేదన్నారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అంటున్నారని.. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జానాభా ఆధారం అంటున్నారని, ఎస్టీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు లేవని, ఎస్టీ, ఎస్టీల జనాభా తేలకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు ఎలా అంటూ ప్రశ్నించారు. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టివేసిందంటూ పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మంత్రం వేస్తానంటూ.. యువతిని ముగ్గులోకి దించిన ఫేక్ బాబా
అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు
Read Latest Telangana News And Telugu News