Engineering Colleges: ఆరు అంశాల ఆధారంగా ఫీజులు
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:52 AM
ఇంజనీరింగ్ కాలేజీలంటే నాలుగేళ్లు బోధించి, పట్టాలు ఇవ్వడానికే పరిమితం కాకూడదు. కొలువులు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి’’... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే ప్రతి సమీక్షలో చెప్పే మాటలివి.
ప్రైవేటు ఇంజనీరింగ్ , వృత్తివిద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కొత్త నిబంధనలు
బోధనలో నాణ్యత, ప్రాంగణ నియామకాలు, ఫీజుల్లో పారదర్శకత
పరిశోధనలకు ప్రోత్సాహం
జాతీయ, అంతర్జాతీయ ర్యాంకుల్లో సత్తా
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలు
ఫీజులను సవరించే అధికారం ఎఫ్‌ఆర్‌సీకి
25 నుంచి ఫీజుల పెంపు దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇంజనీరింగ్ కాలేజీలంటే నాలుగేళ్లు బోధించి, పట్టాలు ఇవ్వడానికే పరిమితం కాకూడదు. కొలువులు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి’’... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే ప్రతి సమీక్షలో చెప్పే మాటలివి. విద్యా శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న సీఎం సూచనల మేరకు.. అధికారులు మూడు నెలలుగా కసరత్తులు చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేశారు. మూడేళ్లకోసారి ప్రైవేటు ఇంజనీరింగ్, వృత్తివిద్య కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ఏడాది పెంచాల్సి ఉండగా.. వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సర్కారు, ఫీజుల నిర్ధారణలో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని ఆధారంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఫీజు నియంత్రణ కమిషన్ (ఎఫ్‌ఆర్‌సీ) పరిగణనలోకి తీసుకునే అంశాలను సమూలంగా మార్చివేశారు. ఇప్పటివరకు కాలేజీలు సమర్పించిన నిర్వహణ వ్యయం, ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను ఖరారు చేస్తుండగా.. ఇకపై ఆరు అంశాల ఆధారంగా ఖరారు చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం కాలేజీలు కోరిన ఫీజుల్లో మార్పులు చేసే అధికారం ఎఫ్‌ఆర్‌సీకి ఉంటుంది.
ఇంజనీరింగ్ విద్య బోధనలో నాణ్యతను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటివరకూ అర్హులైన బోధనా సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టిన ఎఫ్‌ఆర్‌సీ.. ఇకపై విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యనూ బేరీజు వేయనుంది. విద్యార్థుల హాజరు, సామర్థ్యం, ప్రాంగణ నియామకాలు, కొలువులను పరిగణనలోకి తీసుకోనుంది.
విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్), ఫీజుల స్వీకరణ, చెల్లింపుల్లో పారదర్శకత పాటించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం లాంటివి అమలు చేయాలి.
పరిశోధనలను ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయ ప్రచురణల్లో వ్యాసాలు ప్రచురితమవడం, అవార్డులు, వినూత్న ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను ప్రోత్సహించాలి.
జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగుల్లో సత్తా చాటాలి.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాశాఖ కోరిన ప్రణాళికలు అమలు చేయాలి.
25 నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..
ఫీజుల పెంపుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఫీజుల అంశం మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త నిబంధనల ప్రకారం.. తమ ఎదుట హాజరై వివరాలు సమర్పించాలని ఎఫ్‌ఆర్‌సీ అన్ని కాలేజీలకు పంపిన లేఖల్లో కోరింది. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 3 వరకు కాలేజీల నుంచి ఎఫ్‌ఆర్‌సీ దరఖాస్తులు స్వీకరించనుంది. దీనిపై గురువారం ఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఖరారు చేసే ఫీజులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లు అమల్లో ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News