Srushti Fertility Scam Case: సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:19 PM
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు12 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో (Srushti Fertility Scam Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయం తీసుకుంది. ఇవాళ(మంగళవారం) ఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్‌కి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. సృష్టి కేసులో 8 FIRలు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. మరో కేసులో రూ.15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని సృష్టి యాజమాన్యం డిమాండ్ చేసిందని తెలిపారు డీసీపీ రష్మీ పెరుమాళ్.
విశాఖపట్నంలో కూడా సరోగసీ పేరుతో మోసం చేశారని డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. బాధితులకు ఇచ్చిన బేబీ గర్ల్‌కి డీఎన్ఏ టెస్ట్ చేసి సరి పోల్చినప్పుడు ఈ వ్యవహారం బయట పడిందని వెల్లడించారు. ఈ కేసులో చాలామంది డాక్టర్ల ప్రమేయం ఉందని తెలిపారు. విశాఖపట్నంలోని డాక్టర్లు విద్యులత, రవిను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వైజాగ్‌కి చెందిన డాక్టర్ విద్యులతతో పాటు డాక్టర్ రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేశామని వివరించారు. సికింద్రాబాద్‌లో ఉన్న హాస్పిటల్‌ను కేవలం కన్సల్టెన్సీగా మాత్రమే వాడుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడ IVF పేరుతో శాంపిల్స్ తీసుకుంటున్నారని చెప్పారు. మిగతా సరోగసీ ప్రాసెస్ అంతా వైజాగ్‌లో చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు డీసీపీ రష్మీ పెరుమాళ్.
వీరిలో చాలామంది మహిళలు ఉన్నారని... మహిళా నిందితుల్లో చాలామంది అండాలు అమ్ముకున్న వారు ఉన్నారని, సరోగసీ తల్లులుగా నటించిన వాళ్లు ఉన్నారని తెలిపారు. ఎవరైనా దంపతులు సరోగసీ కోసం అప్రోచ్ అవగానే.. వాళ్లకు కొన్నిరోజుల తర్వాత ఒక ఫేక్ అల్ట్రా స్కాన్ రిపోర్ట్ పంపుతారని చెప్పుకొచ్చారు. సరోగసీ పద్ధతిలో మీకు పుట్టబోయే పాప స్కానింగ్ రిపోర్ట్ అని చెబుతారని అన్నారు. అదే సమయంలో డాక్టర్ నమ్రత ఏజెంట్లు ఓ గర్భిణిని వెతికిపెడతారని తెలిపారు. 9 నెలల తర్వాత వైజాగ్‌లో డెలివరీ చేసి.. ఆ శిశువును సరోగసీ ద్వారా పుట్టిన పాప అని చెప్పి దంపతులకు అప్పగిస్తారని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు
Read Latest Telangana News And Telugu News